Bird Flue | అక్కంపల్లి రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు… భయాందోళనలో ప్రజలు….
బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లుగా అనుమానం
ఈ రిజర్వాయర్ ద్వారా జంట నగరాలకు తాగునీరు
భయాందోళనలో ప్రజలు.
వద్ధిపట్లకు చెందిన పౌల్ట్రీ ఫామ్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.
రిజర్వాయర్ను పరిశీలించిన ఆర్డీఓ రమణారెడ్డి
కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్.. విచారణకు ఆదేశం
నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్ లో శుక్రవారం మృతి చెందిన వందలాది కోళ్లు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి రిజర్వాయర్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వారు రిజర్వాయర్ నీటిలో కోళ్ల కళేబరాలను గుర్తించి విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఏకేబీఆర్ రిజర్వాయర్ నుంచే నల్లగొండ జిల్లాలోని వందలాది గ్రామాలకు, హైదరాబాద్ జంట నగరాలకు నిత్యం తాగునీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు ఉన్నాయని మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆ నీటిని తాగిన వేలాది మంది ప్రజలు తమకేమైనా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏ కె బి ఆర్ రిజర్వాయర్ లో మృతి చెందిన కోళ్లను వేసిన ఘటనను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా పరిగణించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. ఏ కే బి ఆర్ రిజర్వాయర్ సమీపంలోని వద్దిపట్ల గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫార్మ్ యజమాని ఇందుకు బాధ్యునిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.