చిట్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రప్రభ): జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రం గ్రామ శివారు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…
మండలంలోని నవాబుపేటకు చెందిన జిల్లెల్ల కుమార్(42) కైలాపురం గ్రామపంచాయతీ కారోబార్ గా పనిచేస్తున్నారు. కాగా తన అవసరాల నిమిత్తం చిట్యాలకు ద్విచక్ర వాహనంపై వచ్చి నవాబ్ పేటకు తిరిగి వెళుతున్న క్రమంలో మండల కేంద్రంలోని గ్యాస్ గోదాం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి తాటిచెట్టుకు ఢీకొని పొలంలోని దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న కుమార్ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులున్నారు. సంఘటన స్థలాన్ని చిట్యాల ఎస్సై జి.శ్రావణ్ కుమార్ పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల సామాజిక హాస్పిటల్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.