Bihar | కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మనవరాలు దారుణ హత్య

పాట్నా: కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు దారుణ హత్య కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలిని ఆమె భర్త గన్‌తో కాల్చి చంపాడు.

అన్యోన్యంగా సాగుతున్న సంసారంలో దంపతుల మధ్య తలెత్తిన అనుమానం కల్లోలం సృష్టించింది.చివరికి పెనుభూతంగా మారి హత్యకు దారితీసి సంసారాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అనుమానంతో భార్యపై భర్త గన గన్నుతో కాల్చి చంపిన ఘటన బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామంలో జరిగింది.

గయా ఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్‌ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్‌ సింగ్‌ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.అయితే రమేష్‌ భార్య సుష్మాదేవీ పట్ల అనుమానం వ్యక్తం చేస్తుండేవాడు. ఇదే విషయంలో భార్యభర్తల మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్‌ గన్నుతో కాల్చి చంపాడు.

అనంతరం పరారయ్యాడు. కాల్పుల మోతతో అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్‌ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.పోలీసులు ప్రాథమిక విచారణలో రమేష్‌ అతని భార్య సుష్మాను అనుమానిస్తుండేవారని, ఆ అనుమానమే పెనుభూతమై ప్రాణాలు తీసినట్లు సమాచారం. .

Leave a Reply