హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు కేసుల (Two cases) ను ప్రజాప్రతినిధుల కోర్టు (Representatives Court) కొట్టివేసింది. నల్గొండ (Nalgonda) 2 టౌన్ పోలీస్ స్టేషన్, కౌడిపల్లి (Kaudipalli) పీఎస్‌లో నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ (TPCC Chief) గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.
2021లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో ఈ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.