ఆక్రమణలపై భీమవరం కలెక్టర్ ఆగ్రహం

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: కాలువలు, డ్రెయిన్ల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం రూరల్ ప్రాంతంలోని గూట్లపాడు శివారు, కొత్త పూసల మర్రు, దొంగపిండి, నాగిడి పాలెం, తోక తిప్ప ప్రాంతాలలో అధిక వర్షాలకు ఉప్పుటేరు బ్యాక్ వాటర్ కారణంగా ముంపు గురైన ప్రాంతాలను విస్తృత స్థాయిలో కలియతిరిగి స్థానిక నివాసితుల నుండి సమస్యలను, ముంపుకు గురవ్వడానికి గల కారణాలను, పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ పర్యటించిన గ్రామాలలో ప్రధానంగా ఉప్పుటేరు బ్యాక్ వాటర్ కారణంగా కొద్దిపాటి వర్షానికే మా నివాస ప్రాంతాల చుట్టూ వద్దకు నీరు చేరుతుందని ఆవేద వ్యక్తం చేశారు. త్రాగడానికి మంచి నీళ్లు రావడంలేదని, వచ్చిన అవి కనీసం వాడుకోవడానికి కూడా వీలు కాని విధంగా ఉన్నాయని, త్రాగునీటికి వాటర్ టిన్ లు తెచ్చుకొని కోరుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ తొలుత గూట్లపాడు శివారు కోతిమొగ డ్రైయిన్ వద్ద వాస్తవ పరిస్థితిని పరిశీలించారు.

కోతిమొగ డ్రైయిన్ ఆనుకుని ఆక్రమణ కారణంగా డ్రైయిన్ సాఫీగా నీటిపారుదల లేదని దీని కారణంగా ఈ ప్రాంతమంతా నీటి ముంపుకు గురవుతుందని స్థానికులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ వాస్తవంగా డ్రైయిన్ వెడల్పు ఎంత ఉండాలి, ఎంత మేరకు ఆక్రమణలకు గురైంది సర్వే చేసి, మార్కింగ్ ఇచ్చి అక్రమణలను వెంటనే తొలగించాలని తొలగించాలని ఇరిగేషన్ అధికారులను, తహసిల్దార్లను ఆదేశించారు.

మార్గం మధ్యలో కొత్తచేడు, బందాల చేడు డ్రెయిన్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కొత్త పూసలమర్రు కాలని సందర్శించి అక్కడ నీటి ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా మునిగిపోతుందని, త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని, పాములు వస్తున్నాయని, స్లూయిస్ సమస్య కారణంగా బ్యాక్ వాటర్ వస్తుందని, కరెంటు స్తంభాలు పాడైపోయాయని, తదితర సమస్యలను వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.

ఆయా సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే మరి కొన్ని రోజులు పునరావస కేంద్రాన్ని కొనసాగించాలని ఆర్డీవోకు సూచించారు. వైద్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం దొంగపిండి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నిలిచిన నీటిని పరిశీలించి, తుఫాను సమయంలో ఎన్ని అడుగుల మేరకు నీరు వచ్చింది అని హెచ్ఎం ను ఆరా తీశారు.

సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దొంగపిండి వద్ద బొండాడ ట్రైయిన్ లో ఒక గంట సేపు పంటుపై ప్రయాణించి కృష్ణ జిల్లా లక్ష్మీపురం వద్ద ఉప్పుటేరులో బొండాడ డ్రైయిన్ కలిసే ప్రాంతానికి చేరుకొని అక్కడ స్లూయిస్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను స్లూయిస్ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్లూయిస్ వినియోగంలో తెచ్చేందుకు అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతుందని తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

స్లూయిస్ వినియోగంలో ఉంటే బ్యాక్ వాటర్ ను అరికట్టవచ్చని, తద్వారా బొండాడ ప్రాంతంలో నీటి ముంపుకు కొంత పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం నాగిడి పాలెంలో బొండాడ డ్రైయిన్ నుండి గ్రామంలోకి నీరు వచ్చిన ప్రాంతాన్ని, మందచేడు లాక్స్ ను పరిశీలించారు. లాక్స్ వద్ద అవసరమైన మరమత్తులను వెంటనే చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంలో స్థానిక ప్రజలు మాట్లాడుతూ నాగిడి పాలెం, రెడ్డిపాలెం, నాగేంద్రపురం మూడు గ్రామాలు త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని, నాగిడి పాలెం, రెడ్డిపాలెం లో వాటర్ ట్యాంకులను నిర్మించాల్సి ఉందని, నాగేంద్ర పురంలో మైక్రో ఫిల్టర్ లను అమృత్సవస్తుందని 90 శాతం పైగా పనులు పూర్తయి నిలిచిపోయాయని తెలిపారు.

ఒక వారం రోజుల్లోగా తాగునీటి సమస్యను పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. నీటి కారణంగా అనేక జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుందని, తాగునీటికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.

గొల్లవారిని తిప్పలో పీహెచ్సీ లేని కారణంగా అనారోగ్యం వచ్చిన, మహిళలకు ప్రసవం వచ్చిన తుందుర్రు తీసుకెళ్లవలసి వస్తుందని, త్రీఫేస్ కరెంటు అవసరం ఉందని, కరెంట్ పోల్స్ ను మార్చడంతో పాటు, కరెంటు వైర్లను కూడా మార్చాలని ఆ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావడం జరిగింది. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం తోకతిప్ప గ్రామంలో ముంపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి స్థానిక ప్రజలతో ముంపుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో ఆన్ నోటిఫైడ్ డ్రయిన్ వలన నిరంతరాయంగా నీళ్లు నిలబడి ఉండడం, కొద్దిపాటి వర్షానికే రోడ్లు కూడా మునిగిపోవడం పెద్ద సమస్యగా ఉందని తెలిపారు.

డ్రైయిన్ వలన ఏమి ఉపయోగం లేదని స్థానిక ప్రజలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో డ్రైయిన్ వాటర్ ను తొలగించడం లేక మెరక చేయడం, లేక ఏదైనా పరిష్కార మార్గాన్ని ఆలోచించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట క్షేత్రస్థాయి పరిశీలనలో భీమవరం ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, ఇరిగేషన్ శాఖ కెనాల్స్ ఈఈ యు.రమేష్, డ్రైయిన్స్ ఈఈ రుద్ర నరసింహ అప్పారావు, కెనాల్స్ డిఈ పి ఎన్ వి వి ఎస్ మూర్తి, ఏఈ జయప్రకాష్, ఏఈ డ్రైయిన్స్ ఎండి ఖాదర్, హౌసింగ్ ఏఈ వి.శశి కుమార్, భీమవరం ఎంపిడిఓ గంగాధర్ రావు, దొంగ పిండి సర్పంచ్ బొడ్డు రేవతి, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, జడ్పీ స్కూల్ హెచ్ఎం జె.వీరభద్రం, పంచాయతీ సెక్రెటరీ శ్రావణ్య, స్థానిక పెద్దలు తిరుమాని శ్రీరాములు, స్థానిక నాయకులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply