ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ కోరుతూ పాదయాత్ర….

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ కోరుతూ పాదయాత్ర….

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బి.ఎల్. నరసింహులు చేపట్టిన పాదయాత్ర సోమవారం అవనిగడ్డకు చేరుకుంది.నిమ్మకూరు నుంచి అకుంఠిత దీక్షతో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన పట్టుచీరల పాలిష్ కార్మికుడు (చేనేత) బి.ఎల్. నరసింహులు ఎన్టీఆర్ పై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహం వద్ద 41 రోజుల మండల దీక్ష స్వీకరించి, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ పాదయాత్రను ప్రారంభించారు. తన ఆరాధ్య నాయకుడికి తగిన గౌరవం దక్కాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన ఈ కఠినమైన యాత్రను కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో భాగంగా అవనిగడ్డకు చేరుకున్న నరసింహులును తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలు ఘనంగా ఆహ్వానించి సత్కరించారు.

ఒక సామాన్య కార్మికుడు ఎన్టీఆర్ పై భక్తితో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి, ఆయన ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.ఈ పాదయాత్ర కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల గుండా సాగుతూ, తిరిగి నిమ్మకూరులోనే ముగియనుంది. ఎన్టీఆర్ కు భారతరత్న రావాలన్నది కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆకాంక్ష అని, ఆ ఆకాంక్షను చాటి చెప్పేందుకే తాను ఈ యాత్ర చేస్తున్నానని నరసింహులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, ఘంటసాల రాజమోహనరావు, దాసినేని శ్రీనివాసరావు, మదివాడ రత్నారావు, మెరుగు సోమిరెడ్డి, చెన్ను బాబూరావు, కంచర్ల ఆనంద్, మేడికొండ విజయ్, నాగిడి రాంబాబు, ముళ్ళపూడి శ్రీనివాసరావు, షేక్ బాబావలి, గుంటూరు వినయ్ బాబు,కూరాకుల ప్రసాద్, గాలం శ్రీను, కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply