MP | భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
శతజయంతి వేడుకల్లో నేతలు, అధికారులు భావోద్వేగం

MP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్మించిన సేవా కార్యక్రమాలు, విద్య–వైద్య సేవలు, నీటి ప్రాజెక్టులు శాశ్వతంగా నిలిచేలా ప్రజలకు మేలు చేశాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు (MP Bastipati Nagaraju) అన్నారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ, ఉన్నతాధికారులు, సాయి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎంపీ బస్తిపాటి మాట్లాడుతూ, “భగవాన్ సత్యసాయి బాబా గారు పుట్టపర్తిలో జన్మించి అనంతపురం జిల్లా అభివృద్ధిని మార్చిన మహనీయుడు. ఒకప్పుడు ఎడారి వాతావరణం పోలిన అనంతపురాన్ని విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులతో ఆయన మార్పు చేశారు. నిర్మించిన సంస్థలు, ఆసుపత్రులు, సేవా కార్యక్రమాలు కోట్లాది మందికి జీవితాంతం ఉపయోగపడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శతజయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఎంపీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 166 దేశాల్లో సాయి సేవా సంస్థలు పనిచేసి, బాబా బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్నాయన్నారు. సాయి ట్రస్ట్‌కు జిల్లావ్యాప్తంగా సహకారం అందిస్తామని తెలియజేశారు.

భగవాన్ బోధనలు నిత్యజీవితానికి మార్గదర్శకం: కలెక్టర్ డా. ఏ. సిరి

కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ, “ప్రేమే మన మతం, ప్రేమే మన కులం’’ అనే బాబా సందేశం మానవతకు మూలస్తంభం అని పేర్కొన్నారు. అనంతపురంలో బాబా ఏర్పాటు చేసిన విద్యా, వైద్య సంస్థలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్న ఆమె, ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతంగా ఉన్న అనంతపురానికి బాబా ప్రాజెక్టులు జీవనాడిగా మారాయని అన్నారు.

జిల్లాలో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ క్రమంలో సాయి సంస్థలు కూడా సహకరించాలన్నారు. ప్రజల పట్ల రాయలసీమ హృదయం ఎప్పుడూ ఋణపడి ఉండే స్వభావం కలిగినదని ఆమె గుర్తుచేశారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, ఆర్ & బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డిసిహెచ్‌ఎస్ డా. జాఫ్రుల్లా, మలేరియా అధికారి నూకరాజు, ట్రస్ట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కన్వీనర్ అశోక్ కుమార్, పీ. లక్ష్మీ సరోజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply