Bhadrachalam | చ‌లో భ‌ద్రాద్రి – సీతారాములోరి క‌ల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాచలంలో రేపు సీతారాముల కల్యాణం

  • ముమ్మ‌ర ఏర్పాట్లు చేసిన ఆల‌య సిబ్బంది
  • క‌ల్యాణానికి హాజ‌రుకానున్న సీఎం రేవంత్ రెడ్డి దంప‌తులు
  • 50 వేల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా
  • ముమ్మ‌ర ఏర్పాట్లు.. భారీ బందోబ‌స్తు

భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలంలో రేపు(ఆదివారం) నిర్వ‌హించే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాద్రిలో క‌ల్యాణం, ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. సీతారామ‌చంద్ర స్వామి క‌ల్యాణం ప్ర‌త్యక్షంగా తిలికించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దంప‌తుల‌తోపాటు ప‌లువురు మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల త‌లంబ్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. దేశ‌, విదేశాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని అధికారులు అంచ‌నా వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా భారీ పోలీసు బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు.

ఆల‌య విశిష్ఠ‌త‌
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోకి సంబంధించి అనేక విశిష్ట‌త‌లు ఉన్నాయి. గోదావరి నది తీరాన‌ శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని తొలుత వెలుగులోకి తెచ్చింది పోకల దమ్మక్క అనే ఆదివాసీ మహిళ. అనంతరం భక్త రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న నిజాం నవాబుల సుంకం పైసలతో దీన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై అనేక పుస్త‌కాలు, సినిమాలు కూడా రూపొందాయి. స్వయంగా రాములవారే తన సోదరుడు లక్ష్మణ స్వామితో కలిసి తానీషా వద్దకు వెళ్ళి రామదాసును చెర నుంచి విడిపించారని చరిత్ర ఉంది. భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు దర్శనమిస్తాయి. అలాగే మహావిష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంకు, ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటారు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుంచి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో ద‌ర్శ‌న‌మివ్వటం వల్ల వైకుంఠ రామునిగా ఈ క్షేత్రంలో ప్ర‌సిద్ధిగాంచారు. దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఇరువురు ఒకే పీఠంపై ఉంటారు. లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

ఆల‌య పున‌ర్నిర్మాణం
1960 నాటికి ఇక్క‌డి సీతారామాలయం జీర్ణావ‌స్థ‌కు చేరుకుంది. నాటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి జోక్యం చేసుకుని రామాలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. రాష్ట్రం నలుమూలల విరాళాలు సేకరించారు. తమిళనాడుకు చెందిన గణపతి స్త‌పతి, 500 శిల్పుల సహకారంతో మూడు లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన క‌ల్యాణ మండ‌పం నిర్మించారు. రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం, శిల్పశోభాయమానమైన గోపురాలు కట్టారు. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమాన గోపురం ఏర్పాటు చేశారు. ఈ విమాన గోపురం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.

భ‌ద్రాద్రిలో చూడ ద‌గిన ప్రాంతాలు
సాధార‌ణంగా భ‌ద్రాచ‌లం వ‌చ్చే భ‌క్తులు, యాత్రీకులు శ్రీ‌సీతారామాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకుని వెళ్లిపోతుంటారు. మ‌రి కొంత మంది ఇక్క‌డ ఉన్న ప్రాంతాలు సంద‌ర్శిస్తారు.ఇటీవ‌ల‌ భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఆదివాసీ సంస్కృతిని పరిచయం చేయటంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ప్రవేశం ఉచితం.

  • భద్రాచలం నుండి 4.5 కి.మీ దూరంలో ఉన్న గుండాల గ్రామం సంద‌ర్శ‌న స్థ‌లాల్లో ఒక‌టి. ఇక్క‌డ త్రిమూర్తులు శీతాకాలంలో తరచుగా వేడి నీటి బుగ్గలలో స్నానం చేస్తారని చ‌రిత్ర‌. భద్రాచలం పట్టణం నుంచి గుండాల గ్రామం నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునికి 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
  • భ‌ద్రాచ‌లానికి కూతవేటు దూరంలోని ఎటపాక గ్రామంలో రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా, జటాయువు అనే పక్షి సీతను కాపాడటానికి రావణుడితో పోరాడిందని, ఆ పోరాటంలో ఒక రెక్క ఇక్కడ పడిపోవడం వల్ల దాని కోసం ఒక చిన్న ఆలయం నిర్మించిన‌ట్లు ఓ క‌థ‌నం. జ‌టాయువు ప‌క్షి జ్ఞాపకార్థం జటాయువు అనే ప్రదేశంగా పిలిచే వారు. కాలక్రమేణా ఏటపాకగా మారింది. ఎటపాక గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వీస్ ఆటోలు 20 రూపాయలు నుంచి 30 రూపాయలు రవాణా కోసం తీసుకుంటారు. పర్ణశాల భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సుల సౌక‌ర్యం ఉంది. ఆటోలు ఉన్నాయి. కారు స్టాండ్ నుంచి కార్లు కూడా లభ్యమవుతాయి. ఆర్టీసీ బస్ కోసం రానుపోను 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆటోలకైతే 200 రూపాయలు. టాక్సీ కోసం 2500 చెల్లించాల్సి ఉంటుంది.
  • పర్ణశాలలో వేంచేసి ఉన్న రాముడిని ఆత్మరాముడు అని పిలుస్తారు. ఇక్కడ రాముడు ఖరదేయోషణుడు నేతృత్వంలోని 14000 మంది రాక్షసులను చంపాడని చ‌రిత్ర చెబుతుంది. ఈ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం నిర్మించబడిందని చెబుతారు. ఈ ప్రదేశానికి దుమ్ముగూడెం అని పేరు పెట్టారు.
  • పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని అభయరణ్యం పర్యాటక ప్రాంతం ఒక‌టి. భద్రచలం నుంచి శ్రీరామగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ నుంచి పాపికొండలు పడవ ప్రయాణం చేయడం ఒక అనుభూతి. శ్రీ సీతారాములు క‌ల్యాణం కోసం వచ్చే భక్తులు పుణ్యకార్యంతో పాటు, విహార యాత్ర, చరిత్ర గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టు భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాల్వంచ వరకు బస్సులో చేరుకుని అక్కడ నుంచి వివిధ మార్గాలలో కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించవచ్చు. అక్కడికి వెళ్లిన వారు బోట్ షికారు మరవకండి.
  • పాపికొండలు సందర్శించాలంటే భద్రాచలం నుంచి టూర్ ఆపరేటర్లు 1500 నుంచి 2000 వరకు వసూలు చేసి ఏర్పాట్లు చేస్తారు. భద్రాచలం నుంచి రవాణా లాంచీలో భోజనం తదితర ఏర్పాట్లు వారిని నిర్వహిస్తారు.

భ‌ద్రాచ‌లానికి రావాలంటే..?
భ‌ద్రాచ‌లంలో ఆదివారం జ‌రిగే సీతారాముల క‌ల్యాణం చూడటానికి వ‌చ్చే భక్తులు విజయవాడ, హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో చేరేందుకు రవాణా సౌకర్యం చక్కగా ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు కొత్తగూడెంలో దిగి రోడ్డు మార్గం ద్వారా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం చేరుకోవ‌చ్చు.

క‌ల్యాణానికి సీఎం హాజ‌రు
భ‌ద్రాచ‌లంలో శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఆదివారం జ‌రుగు సీతారామ‌చంద్ర‌స్వామి క‌ల్యాణోత్స‌వానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులు హాజ‌రు కానున్నారు. ప్ర‌భుత్వం త‌రుఫున ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రుగు కార్య‌క్ర‌మాలో ఆయ‌న పాల్గొంటారు. అలాగే డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మాక్క‌, మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, డి.శ్రీ‌ధ‌ర్ బాబు, కొండా సురేఖ త‌దిత‌రులు హాజ‌రు కానున్నార‌ని తెలిసింది.

భారీ బందోబ‌స్తు
సీతారామ‌చంద్ర‌స్వామి క‌ల్యాణోత్స‌వానికి భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వ‌హిస్తారు. నిరంత‌రం పోలీసు అధికారులు ప‌ర్య‌వేక్షిస్తారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇవీ సౌక‌ర్యాలు

  • ఇప్ప‌టికే టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టారు. నేరుగా వ‌చ్చి తీసుకునేవారి కోసం దేవాల‌యం వ‌ద్ద‌, ఆర్డీఓ కార్యాల‌యం వ‌ద్ద టిక్కెట్లు కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు.
  • భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలో 19 కేంద్రాల ద్వారా ప్ర‌సాదాలు విక్ర‌యిస్తారు
  • త‌లంబ్రాలు పంపిణీకి 40 కేంద్రాలు ఏర్పాటు చేశారు
  • భ‌క్తులకు త‌క్ష‌ణ వైద్య సేవ‌లు అందించ‌డం కోసం ఎనిమిది ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • కేవ‌లం భ‌క్తుల కోసం భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక ఐసీయూ ఏర్పాటు చేశారు. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు ఇక్క‌డ నుంచి సేవ‌లు అందిస్తారు. వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు.
  • ఆరు కేంద్రాల్లో అగ్నిమాప‌క సిబ్బంది నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తారు. ఎలాంటి ప్ర‌మాదం జ‌రిగిన వారి దృష్టికి తీసుకు వెళితే త‌క్ష‌ణం స్పందిస్తారు.
  • నిరంత‌రం పారిశుధ్యం కోసం 350 మంది పారిశుధ్య కార్మికుల‌ను నియ‌మించారు. అలాగే ప‌ర్య‌వేక్ష‌ణ సిబ్బంది కూడా ఉన్నారు.
  • భ‌క్తుల‌కు ఎలాంటి స‌మ‌చారం ఇవ్వ‌డానికి నాలుగు స‌మాచార కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.
  • గోదావ‌రి న‌ది తీరంలో స్నానాలు ఘ‌ట్ వ‌ద్ద 20 మంది గ‌జ ఈత‌గాళ్లు, బోట్లు, రెస్క్యూ సిబ్బంది ఉంటారు. వీరు నిరంతం ప‌ర్య‌వేక్షిస్తారు. ప్ర‌మాదంలో చిక్కుకున్న వారిని వెంట‌నే బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తారు. అలాగే ప్ర‌మాద హెచ్చ‌రికా బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారుల సూచ‌న‌ల మేర‌కు స్నానాలు భ‌క్తులు చేయడం సుర‌క్షితం.
  • ప్రొటోకాల్ అధికారిని నియ‌మించారు. ప్రొటోకాల్ పాస్‌లు ఉన్న‌వారు ఆ అధికారిని సంప్ర‌దించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *