నిజామాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జిజిహెచ్‌)లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) నరేంద్ర కుమార్ టీవీవిపి కమిషనర్‌ అజయ్‌కుమార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు.

ఈ త‌నిఖీల సంద‌ర్భంగా.. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, ఫీవర్‌ వార్డ్‌, ఐటీహెచ్‌, ల్యాబ్‌లు పరిశీలించారు. రోగులను ప్రత్యక్షంగా కలసి అందిస్తున్న వైద్యసేవలపై వివరాలు తెలుసుకున్నారు.

డిఎంఈ మాట్లాడుతూ –

వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో డెంగ్యూ, చికెన్‌గున్యా, వైరల్‌ ఫీవర్‌, డయేరియా, వాంతులు ప్రబలే అవకాశం ఉందని, మందుల కొరత రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలోని బెడ్స్‌ లభ్యత, సిబ్బంది వివరాలు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించారు.

అవసరమైతే ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అత్యవసర చికిత్సా సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

అదేవిధంగా డిచ్పల్లి సిహెచ్సి, ఇందల్వాయి పిహెచ్సిలను కూడా డిఎంఈ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజూ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య, సిబ్బంది లభ్యత, మందుల నిల్వలపై అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఏ పరిస్థితుల్లోనూ వైద్య పరమైన ఇబ్బందులు కలగకూడదని. అందుకోసం అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని డిఎంఈ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.

ఈ తనిఖీలలో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్‌ రాములు, డిఎంహెచ్వో రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్వో అంజనా, తుకారం రాథోడ్‌, మెడికల్‌ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ నాగమోహన్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply