Bellampalli | ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు..

Bellampalli | ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు..
Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉన్నదని, అందులో వామపక్షాలు ప్రధాన భూమిక పోషించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని సీపీఐ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజాకంటక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతూ.. ధనికులను మరింత ధనవంతులుగా, పేదలను కడు పేదలుగా మారుస్తోందని విమర్శించారు.
ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసి, బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్యకర్తలంతా సమాయత్తం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, సీనియర్ నేత, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్య, బీకేఎంయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు అక్కపెల్లి బాబు, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం, కొండు బానేష్, బొంతుల లక్ష్మీనారాయణ, రత్నం రాజ్యం, కొంకుల రాజేష్ పాల్గొన్నారు. మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు డి.ఆర్. సక్కుబాయి, నాయకులు బొంకూర్ రామచందర్, అందుగుల రాజేందర్, గోలేటి రాయలింగు, ఇనుముల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
