తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలే ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందగా, ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ.. ఈరోజు తుది శ్వాస విడిచారు.
లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు 13 జూలై 2025న మృతి చెందిన విషయం తెలిసిందే. కోట మరణం వార్త మరవకముందే.., రుక్మిణి మరణ వార్త కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ.. నటన వైపు అడుగులు వేశారు. 1966లో ఆయనకు రుక్మిణితో వివాహమైంది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన కోట శ్రీనివాసరావు.. నటుడిగా కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో కుటుంబ బాధ్యతలను రుక్మిణి భుజాన వేసుకుందని, తన భార్య కారణంగానే ఇంటిలో సౌఖ్యం నిలిచిందని కోట గతంలో అనేకసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక కోట శ్రీనివాసరావు చనిపోయిన దాదాపు నెలరోజులకే ఆయన భార్య మృతి చెందడం బాధాకరం అంటూ…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.