Araku | మాడగడ మేఘాలకొండ అందాలు వర్ణించతరమా !

Araku | మాడగడ మేఘాలకొండ అందాలు వర్ణించతరమా !
అరకులోయ రూరల్, ఆంధ్రప్రభ : ఈ భూ ప్రపంచంలో అంతులేని వింతలకు, చరిత్రలో లిఖించలేని కథలకు, వర్ణించలేని అందాలకు కోదవే లేదు. అయితే కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుస్తుండగా మరికొన్ని కాలక్రమేన వెలుగులోకి వస్తు ఆ ప్రాంతానికి వెలుగునిస్తూ ఔరా అనిపిస్తున్నాయి.
ఇలా ఆహా.. ఓహో.. ఔరా అనిపించే అద్భుత సుందర మణిమకుటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి జిల్లాలో ఉంది. ఆ అద్భుత భూతల స్వర్గమే ఆంధ్ర ఊటీ అరకులోయ. దేశానికే తలమానికంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వ కారణంగా, అల్లూరి జిల్లాకు మణిహారంగా, ఉన్న అరకులోయలో అద్భుత అందాలకు కొదవలేదు.

ఈ అద్భుత అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. అయితే భూతల స్వర్గాన్ని తలపించేలా పర్యాటకుల మదిని మరిపించేలా వారి హృదయాలను దోచుకునేలా ఉన్న ఒక అద్భుత ప్రదేశం అరకులోయలోనే ఉంది.
ఆ ప్రదేశమే మాడగడ మేఘాలకొండ. అరకులోయ పట్టణ ప్రాంతానికి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూతల స్వర్గం గత మూడు ఏళ్లుగా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ వస్తుంది.
ప్రపంచంలో ఎన్ని అద్భుత వింతలు ఉన్నప్పటికీ…. ఈ మాడగడ మేఘాల కొండ అద్భుత సుందర దృశ్య మనోహరం ఏ కవికి వర్ణించలేని విధంగా ఉండే ప్రకృతి వరం.

చలి, వేసవి, వర్షకాలంతో సంబంధం లేకుండా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు మంచు తెరలు కప్పుకున్న వెండి మబ్బులు పర్యాటకులకు, స్థానికులకు సాక్షాత్కరిస్తూ మంత్రముగ్ధులకు లోను చేస్తూ ఉంటాయి.
ఇక సూర్యోదయ సంధ్య వేళ అందాలు ఈ మాడగడ మేఘాలకొండ అద్భుత అందాలు కనువిందు చేస్తూ పర్యాటకులకు ఆహ్లాద భరితులను చేస్తూ ఉంటాయి.
పాల సముద్రం వలే కనిపించే అద్భుత మంచు అందాల దృశ్యాలు ఆనందానుభూతులకు గురి చేసే పరిసర ప్రాంతాల సుందర సొగసులు పర్యాటకులను స్వర్గ లోకంలో విహరింప చేస్తాయి.

ఇటువంటి అందాల నడుమ ఎన్ని రోజులు ఉన్నా…… ఎన్ని నెలలు గడిపినా…. ఆనందం మరువలేనిదని, మరుపు రానిదని పర్యాటకులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
ప్రపంచంలో గొప్ప గొప్ప అందాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమే కనువిందు చేసే దృశ్యాలు. అయితే మాడగడ మేఘాల పర్వతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అద్భుత ఊహలోక దృశ్యాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తూ.. స్వర్గ లోకంలో విహరిస్తున్నామా… అనే ఆలోచనలకు తెరతీస్తూ ఉంటాయి….

అరకు లోయ నుంచి సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే, పర్యాటకులను అబ్బురపరిచే అద్భుతమైన ‘మేఘాల కొండ’ దర్శనమిస్తుంది. ఈ అద్భుత ప్రదేశం మాడగడ గ్రామంలో ఉంది. గ్రామం నుంచి కొండపైకి చేరుకోవడానికి దాదాపు కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.

ముందుగా ఆటో ద్వారా మేఘాల కొండ దగ్గరికి చేరుకోవచ్చు. కొండపైకి చేరుకోగానే, అక్కడి దృశ్యాన్ని చూసి పర్యాటకులు మైమరిచిపోవడం ఖాయం. చుట్టూ ఉన్న కొండల మధ్యలో పాలసముద్రం మాదిరిగా కమ్ముకున్న తెల్లటి మంచు మేఘాలు కనువిందు చేస్తాయి.
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేలేత కిరణాలు ఈ మంచు మేఘాలను పలకరిస్తున్న దృశ్యం పర్యాటకులను పులకరింపజేస్తుంది. ఇప్పటివరకు వంజంగి, లంబసింగి అందాలకు ముగ్ధులైన పర్యాటకులు, ఇప్పుడు మేఘాల కొండ అద్భుత దృశ్యాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతం అరకు లోయ టూరిజంలో మరో ముఖ్య గమ్యస్థానంగా మారింది.

