అప్రమత్తంగా ఉండండి
అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
(ఆంధ్రప్రభ బ్యూరో), శ్రీకాకుళం, అక్టోబర్ 26: బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివవారం ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు మట్లాడి మొంతా తుఫాను ప్రభావంపై ఆరా తీశారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. కాలువలు, చెరువులు, నదులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు,
ముంపు ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని,తుఫాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాతావరణం శాఖ అంచనా ప్రకారం భారీ వర్షాల పడే అవకాశం ఉండటంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికారులు పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పునరావాస కేంద్రాలు సిద్దంగా ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూమ్ సేవలతో పాటు, అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

