బాసర, ఆంధ్రప్రభ : బాసర పుణ్యక్షేత్రంలోని వేద పాఠశాలలో విద్యార్థి పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేద పాఠశాలలో చదువుతున్న తూప్రాన్ కు చెందిన విద్యార్థి తల పై మూడు చోట్ల తీవ్రమైన గాయాలపాలై మరుగుదొడ్డి వద్ద పడి వున్నాడు. శుక్రవారం ఉదయం రోజు వారీ పూజల కోసం విద్యార్థి కోసం వెతకగా రక్తపుమడుగులో ఉన్న వేద విద్యార్థిని పాఠశాల సిబ్బంది గుర్తించారు.. హుటాహుటిన బైంసా లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వేద పాఠశాలలో సీసీ కెమెరాలు ఉన్న విద్యార్థి పై దాడి సమయంలో పని చేయకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గోప్యంగా ఉంచిన యాజమాన్యం?
వేద పాఠశాలలో వేదం చదువుతున్న విద్యార్థి పై దాడి ఘటన గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేద పాఠశాలలో విద్యార్థి దాడి ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థి పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
వేద పాఠశాలను సందర్శించిన ఎస్పీ, ఏఎస్పీ
వేద పాఠశాలలో వేదం చదువుతున్న విద్యార్థి పై దాడి ఘటనపై పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. శనివారం వేద పాఠశాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏ ఎస్ పి అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, బాసర ఎస్సై గణేష్ సందర్శించారు. విద్యార్థి పై దాడి ఘటనపై వేద పాఠశాల సిబ్బంది, వేదం చదువుతున్న విద్యార్థుల నుండి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి విషయాలను విచారణ అనంతరం వివరిస్తామని పేర్కొన్నారు.