బెంగళూరు: అరుదైన బ్లడ్ గ్రూప్ తో దక్షిణ భారత మహిళ ప్రపంచ వైద్యంలో చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఎవరూ చూడని బ్లడ్ గ్రూప్ గుర్తించడం తో భారతీయ వైద్య శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన ఘనతను సాధించారు.
38 ఏళ్ల ఈ మహిళ గుండె శస్త్రచికిత్స కోసం కోలార్ జిల్లా ఆర్.ఎల్. జలప్ప ఆసుపత్రికి వచ్చినప్పుడు, ఆమెకు అవసరమైన రక్తంతో కలపడానికి తీసుకున్న అన్ని రక్త నమూనాలు విఫలమయ్యాయి. ఆమె రక్తం అన్ని నమూనాలకు ‘పాన్ రియాక్టివ్’గా స్పందించింది. దీనితో వైద్యులు మరిన్ని పరీక్షలు చేయవలసి వచ్చింది.
ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి, వైద్యులు రక్త మార్పిడి లేకుండా ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడం గమనార్హం.
‘CRIB’: భారత్ నుంచి కొత్త రక్త యాంటిజన్ గుర్తింపు
ఆమె రక్త నమూనాలను UKలోని బ్రిస్టల్‌లోని ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబ్‌కు పంపగా, 10 నెలల లోతైన విశ్లేషణ తర్వాత, శాస్త్రవేత్తలు ఆమె రక్తంలో క్రోమోజోమల్ వ్యవస్థలోకి ప్రవేశించే కొత్త యాంటిజెన్‌ను గుర్తించారు. దీనికి CRIB (క్రోమర్ ఇండియా బెంగళూరు) అని పేరు పెట్టి, 2025 జూన్‌లో మిలాన్‌లో అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచంలోనే తొలి కేసుగా భారత మహిళ గుర్తింపు
ఇండియన్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ISBT) మార్గదర్శకాల ప్రకారం, ఈ మహిళ ప్రపంచంలోనే CRIB యాంటిజెన్ పొందిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఇది భారత వైద్య రంగానికి గొప్ప విజయం.