TG | ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిలు
హైదరాబాద్,ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురామ్‌లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈక్రమంలో రూ. 20వేల పూచికత్తు, రెండు షూరిటీ-లు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన మద్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్ సమర్పించారు. దీంతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 3 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిన విషయం విదితమే.
మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వంశీకృష్ణ,సంతోష్‌కుమార్, పరుశురామ్‌లు ఓ రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి కాంగ్రెస్ నేత, రియాల్టర్ చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీంతో ముగ్గురిపై వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ఏ 1గా, రాధాకిషన్ రావును ఏ2గా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా బుధవారం జరిగిన విచారణలో జస్టీస్ లక్ష్మణ్ పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.