విశాఖలో బహుజనగణమన ఆవిష్కరణ

బీసీల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని వర్గాలలోని ప్రగతిశీలవాదులు, కవులు, రచయితలు, సృజనశీలురు మద్దతు ప్రకటించాలని బడుగుల పక్షాన నిలవాలని పలువురు బీసీ ఉద్యమకారులు కోరారు.

విశాఖపట్నం పలు ప్రగతిశీల ఉద్యమాలకు పురుడు పోసిందని, నాడు శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా విశాఖ విద్యార్థులు ‘‘కవులారా మీరెటువైపు’’ అని వేసిన కరపత్రం విప్లవకవిత్వానికి బాటలు వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సరిగ్గా బీసీల ఉద్యమంగా రగులుటున్న ఈ సందర్భంగా ‘అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రగతిశీలవాదులారా మీరెటువైపని’ బహుజన ఉద్యమం అడుగుతుందన్నారు.

6 సెప్టెంబర్, 2025 శనివారం ఉదయం విశాఖ జిల్లా కోర్టు ముందు గల మహాత్మా జ్యోతిభా ఫూలే, సర్దార్ గౌతు లచ్చన్న, ఆర్.కే.బీచ్ లోని జాలాది విగ్రహాల ముందు ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమీషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బహుజనగణమన’ దీర్ఘ కావ్యాన్ని మాజీ వీసీ, యుపిఎస్సీ పూర్వ సభ్యులు కే.యస్. చలంతో పాటు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గోడి నరసింహాచారి, బీసీ స్టడీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడు అప్పారావు, రచయిత్రి జాలాది విజయ, అరసం నేతలు ఉప్పల అప్పలరాజు, శ్యామసుందర్, స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గౌడ్ తదితరులు సామూహికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కుప్పం మాజీ వీసీ కే.యస్.చలం మాట్లాడుతూ నాడు ‘కవులారా మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు వేసిన కరపత్రానికి శ్రీశ్రీ కదిలి రావడం నూతనశకానికి ఆరంభమైతే ఇప్పుడు విశాఖలో జూలూరు రాసిన ‘బహుజనగణమన’ కావ్యం బహుజన ఉద్యమానికి డిక్లరేషన్ లాంటిదని అన్నారు.

అంతిమంగా బహుజన రాజ్యాధికారమే ఈ దేశంలో మిగిలిన విప్లవం అన్నారు. గోడి నరసింహాచారి మాట్లాడుతూ 1970 సమయంలో జగదాంబ సెంటరులో దిగంబర కవిత్వాన్ని రిక్షాపుల్లర్ చేత దిగంబర కవులు ఆవిష్కరింపజేశారని, తిరిగి ఇప్పుడు జూలూరు రాసిన ‘‘బహుజనగణమన’’ కావ్యాన్ని విశాఖ వీధుల్లో పలు చేతివృత్తుల వారి చేత ఆవిష్కరింపజేయటం నూతనాధ్యాయానికి తలుపులు తెరిచిందన్నారు.

పుస్తక కావ్యకర్త జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన తరతరాల అణిచివేత సామాజిక న్యాయాన్ని ప్రధాన వస్తువుగా చేసి ఈ కావ్యాన్ని రాయటం జరిగిందని చెప్పారు.

జ్యోతిబా ఫూలే, గౌతులచ్చన్నల విగ్రహాల సాక్షిగా బహుజన ఉద్యమకారులంతా రాజ్యాధికారమే అంతిమ తీర్పని చెబుతున్నారని, కవులు, రచయితలు, సృజనకారులంతా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. ఇది కులపోరాటం కాదని, సమానత్వం కోసం, సమన్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరు అని, ఈ ఉద్యమానికి ప్రగతిశీలవాదులంతా మద్దతు పలకాలని కోరారు.

చట్టసభలకు పైకులాలు, బహిరంగ సభలకు క్రిందికులాలా అని ఆయన ప్రశ్నించారు.

గాజువాకలో కవి అంతరంగ ఆవిష్కరణ:
గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీకాలేజీలో బహుజనగణమన దీర్ఘకావ్యంపై కవి జూలూరు ‘అంతరంగ ఆవిష్కరణ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాలు దళిత బహుజన ఉద్యమాలు వాటి ఆవశ్యకత, తీరుతెన్నులను వివరించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ అస్తిత్వాలను లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించారు. బహుజనగణమన దీర్ఘకావ్యం మనుషులను చీల్చేది కాదని, దేశసమైక్యతను కోరే అట్టడుగు కులాల సామాజిక న్యాయ పోరాటమన్నారు. ఈ కార్యక్రమంలో ఏంవీఆర్ డిగ్రీకాలేజి కరస్పాండెంట్ డా. రామారావు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గోడి నరసింహాచారి పాల్గొన్నారు.

కులవృత్తులవారిచే పుస్తకావిష్కరణ

దక్షిణ విశాఖ 38వ వార్డులో పలు కులవృత్తుల వారి చేత, చేతివృత్తి దారుల చేత పుస్తకావిష్కరణలు వినూత్నంగా జరిపించారు.

Leave a Reply