బాసర, జూలై 1 (ఆంధ్రప్రభ) : మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను మంగళవారం అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచి ఉంచాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేంద్ర జల సంఘం అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ (Telangana Irrigation Department) అధికారుల సమక్షంలో జరుగుతుంది. బాబ్లీ బ్యారేజీ గేట్లు ఎత్తడం వల్ల ఒక టీఎంసీ వరదనీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇరిగేషన్ టి.శ్రీనివాసరావు గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పర్ గోదావరి డివిజన్ సిడబ్ల్యుసి ఎం.ఎల్.ఫ్రాంక్లిన్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అంతంత మాత్రంగానే వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన కురిసే వర్షాలకు బాబ్లీ నుంచి అయినా వరద శ్రీరామసాగర్ లోకి చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు. బాబ్లీ నుంచి నీటి విడుదలతో గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని, పరిసర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచించారు.
