రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన

రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన

సూక్ష్మ నీటి సాగులో ఆటోమేషన్ యూనిట్‌ ప్రదర్శన

కర్నూలు, ఆంధ్రప్రభ : సూక్ష్మ నీటి సాగు పద్ధతుల్లో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించే భాగంగా కర్నూలు జిల్లాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆటోమేషన్ యూనిట్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం (APMIP) ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాసులు సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఆటోమేషన్ యూనిట్ పనితీరు, ప్రయోజనాలపై రైతులకు శిక్షణతో పాటు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ నీటి సాగులో ఆటోమేషన్ సాంకేతికతను వినియోగించడం ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు శ్రమను తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ విధానం, దాని ఉపయోగాలపై సంక్షిప్తంగా వివరించారు.
ఇండస్టిల్ ఫార్మ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఆటోఫామ్ ప్రతినిధులు ఆటోమేషన్ యూనిట్ ప్రధాన భాగాలు, వాటి ఇన్‌స్టాలేషన్ విధానం, పని తీరును రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆటోఫామ్ మొబైల్ యాప్ ద్వారా ఇరిగేషన్ షెడ్యూల్‌ను ఎలా నిర్వహించాలో ప్రత్యక్షంగా చూపించారు. మొబైల్ ఫోన్ ద్వారా వ్యవసాయ పరికరాలను నియంత్రించే విధానాన్ని ప్రదర్శించారు.


ఏపీఎంఐపి ఏపిడీ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వము ఈ పథకం కింద రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న రైతులకు 55 శాతం, పెద్ద రైతులకు 45 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆటోమేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న రైతు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సాంకేతికత వల్ల శ్రమ తగ్గడంతో పాటు ఇంటి నుంచే పరికరాలను నియంత్రించుకోవచ్చని తెలిపారు. నీరు, ఎరువులు కూడా గణనీయంగా ఆదా అవుతున్నాయని చెప్పారు. ఇతర రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా ఉద్యాన శాఖాధికారులు, ఏపిడీ ఫిరోజ్ ఖాన్, ఆటోమేషన్ ఎంపానెల్డ్ కంపెనీ ప్రతినిధులు, కంపెనీ ఇంజినీర్లు, ఎంఐ మండల అధికారులు, నంద్యాల జిల్లా ఎంఐ ఇంజినీర్లు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply