Avinash | వైసీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు

Avinash | వైసీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు
- ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దహనం
Avinash | ఆంధ్రప్రభ, విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ భోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. జిల్లా, నగర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను నేడు భోగి మంటల్లో తగలబెట్టామని చెప్పారు. చెత్తను తగలబెట్టినట్లే ప్రజా వ్యతిరేక జీవోలను కూడా భోగి మంటల్లో దహనం చేశామని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రభుత్వం మంచి పాలన అందించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గత రెండేళ్లుగా కూటమి నేతలు మాత్రమే ఆనందంగా ఉన్నారని, కోడి పందేలు వేసుకునే వారికే ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పండుగలు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదని అన్నారు. టీడీపీ నేతలు సంతోషంగా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలతో కోడి పందేల లీగ్‌లు నిర్వహిస్తుండగా, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదని ఆరోపించారు.
జగన్‌ను ఎందుకు ఓడించామనే బాధ ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ స్కాంలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కోటి మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఏ దుస్థితిలో ఉందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురవుతుందని హెచ్చరించారు.
