రేపటి నుంచి అమ్మవారి ప్రధాన జాతర..

రేపటి నుంచి అమ్మవారి ప్రధాన జాతర..

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి అద్దంకి నాంచారమ్మ..!
ఏర్పాట్లలో నిమగ్నమైన
అధికార యంత్రాంగం

ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం విశ్వనాధపల్లి గ్రామంలో కృష్ణాతీరంలో కొలువై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే విశేష పూజలందుకుంటున్న విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ అమ్మవారు ప్రధాన జాతరోత్సవాలకు ఆలయం సుందరంగాముస్తాబైయింది. ఈ నెల 2,3 తేదీల్లో జరిగే అమ్మవారు జాతరకు రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో దేవదాయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

15 రోజుల పాటు చిన్నఅమ్మవారి ఊరేగింపు..

జాతరకు 15 రోజుల ముందు (పాల్గుణ శుద్ధ పాఢ్యమి) రోజున నాంచారమ్మ చిన్నఅమ్మవారిని ఆలయం నుంచి బయటకు తీసి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆలయం నిర్మించిన గ్రామపెద్ద రామినీడుకు కూడా ప్రత్యేక ఉత్సవాన్ని జరుపుతారు. విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, గాబ, కుమ్మరిపాలెం గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద అమ్మవారి భక్తులు పూజలు చేస్తారు. వాహనాలు లేకుండా ప్రజలు నడుచుకుంటునే అమ్మవారిని ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన చిన్న అమ్మవారి ఊరేగింపును ప్రారంభించగా, ప్రస్తుతం వి కొత్త పాలెం గ్రామంలో అమ్మవారి గ్రామోత్సవం సాగుతుంది.

ఆలయ ప్రాశస్త్యం.. (విశిష్టత)

నాంచారమ్మ తల్లి ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్రే ఉందని గ్రామ పెద్దలు చెబుతారు. వారుతెలిపిన వివరాలప్రకారం..విశ్వనాథపల్లి గ్రామంలో సుమారు ఐదు శతాబ్దాల కితం కరువు కాటకాలు వచ్చాయి. పశువులకు కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతులు తమ పశువులను నాటి ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి వలస వెళ్లారు. అక్కడ పశువులు కొంత కాలం బాగానే ఉన్నా, తరువాత అంతుచిక్కని వ్యాధితో మృతిచెందాయి. దీంతో రైతులు తిరిగి మళ్లీ తమ పశువులను విశ్వనాథపల్లి గ్రామానికి తొలుకు వచ్చారు. ఆ సమయంలో పశువులతో పాటు ఓ బాలిక విశ్వనాథపల్లికి వచ్చి, ఇక్కడ అంతర్థానమైంది.

గ్రామానికి చెందిన ఒక మహిళకు పూనకం వచ్చి తాను అద్దంకి నాంచారమ్మ నని, తనకు గ్రామంలో ఆలయం నిర్మాణం ట్టాలని కోరింది. దీంతో గ్రామపెద్ద రామినీడు గ్రామ నడిబొడ్డు అమ్మవారికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. కరువు కాటకాలు తొలగి గ్రామ స్తులు ఆర్థికంగా వృద్ధి చెందగా, అప్పటి నుంచి ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ అమ్మవారి ప్రధాన జాతర నిర్వహించడం ఆనవాయితీ.

గుంటూరు, ప్రకాశం జిల్లాల భక్తులకు ఇలవేల్పు..

నాంచారమ్మ అమ్మవారు అద్దంకి గ్రామం నుంచి రావడంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలు అమ్మవారి పుట్టింటివారుగా భక్తులు భావిస్తారు. దీంతో అమ్మవారి జాతరకు ఈ రెండు జిల్లాలనభక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రత్యేక వాహనాల్లో జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. జాతరకు లక్ష మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా. భక్తుల సౌకర్యం కోసం రేపల్లె, అవనిగడ్డ నుంచి ‘విశ్వనాథపల్లి స్పెషల్’ పేరుతో 10 ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2 తేదీన నాంచారమ్మ మూలమూర్తికి ప్రత్యేక అలంకారం, నైవేద్యాలు సమర్పణ 3 తేదీన ఆలయ ప్రధాన గుడి జాతరను నిర్వహించనున్నారు.

Leave a Reply