అట్టహాసంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ్మ నామస్మరణతో పులకరిస్తున్నా ఇంద్రగిరులు
ప్రత్యేక పూజలు, అలంకరణలు తర్వాత 9 గంటల నుండి అమ్మ దర్శనం
తొలి దర్శనం చేసుకున్న కమిషనర్, ఈవో, సిపి, కలెక్టర్ మంత్రులు
వైభవంగా ప్రారంభమైన కుంకుమ పూజలు ఇతర ఆర్జిత సేవలు
నూతన యాగశాలను ప్రారంభించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే సుజనా
మధ్యాహ్నం వరకు పోటెత్తిన భక్తులు
ఏర్పాట్లపై భక్తుల నుండి సంతృప్తి
క్యూలైన్లో పర్యటిస్తూ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మిశ
అన్న, లడ్డూ ప్రసాద్ తయారీని పరిశీలించిన కమిషనర్ రామచంద్ర మోహన్
అభిప్రాయాలను స్కాన్ రూపంలో తెలియజేస్తున్న భక్తులు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కల్లాకపటం ఎరుగని బాల్యం దైవత్యానికి ప్రతీక. చరాచర సృష్టిని తన బిడ్డలుగా భావించే జగజ్జనని బంగారు తల్లి కనకదుర్గమ్మ (Kanakadurgamma) తనలో బాల్యాన్ని ఆపాదించుకునే బాల త్రిపుర సుందరీ దేవి (Bala Tripura Sundari Devi)గా ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై భక్తులకు దర్శనం ఇచ్చింది. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర దసరా (Dussehra) శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటిరోజు అశ్వేయిజ శుద్ధ పాడ్యమి సోమవారం ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జై భవాని.. జై జై దుర్గ భవాని అనే నినాదంతో భక్తులు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లోని మొదటి రోజు సోమవారం తెల్లవారుజామున అమ్మవారి అలంకరణ పూజల అనంతరం మొట్టమొదటిసారిగా బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారిని మంత్రులు, దేవాదాయ శాఖ కమిషనర్ (Commissioner of Endowments Department), ఈవో సిపిలు దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యాన్ని అధికారులు అప్పటికే అమ్మ దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ మహా మండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలను ఇతర ఆర్జిత సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

9 గంటల నుంచి అమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ తర్వాత తొమ్మిది గంటల నుండి కనకదుర్గమ్మ దర్శనాన్ని భక్తులకు కల్పించారు. బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ కరుణాకటాక్షాల కోసం తెల్లవారుజాము నుండే భక్తులు కెనాల్ రోడ్ లోని వినాయకుడి గుడి నుండి ప్రారంభమవుతున్న క్యూలైన్ల ద్వారా సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి కి చేరుకుని వివిధ మార్గాల ద్వారా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకవైపు అమ్మవారి నామస్మరణ గీతాలు, మరోవైపు జై భవాని జై జై భవాని శరణు ఘోషతో ఇంద్ర గిరిలు పులకరిస్తున్నాయి. అమ్మవారికి అత్యంత ఇష్టమైన కుంకుమార్చన, ఖడ్గమాలార్చన, కుంకుమార్చన వంటి ప్రత్యేక ఆర్జిత సేవలను మహా మండపం ఆరవ అంతస్తులో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

నూతన యాగశాల ప్రారంభం
ఇంద్రకీలాద్రి పై దాతల సహాయంతో నూతనంగా నిర్మించిన రాతి యాగశాల, పూజా మంటపం లను సోమవారం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుజనా చౌదరి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో కలిసి ప్రారంభించారు. యాగశాల దాత సంగా నరసింహారావు ఇచ్చిన విరాళాలతో నిర్మించారు. ఇక నుండి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే చండీ హోమాన్ని ఇదే యాగశాలలో నిర్వహించడంతోపాటు అన్ని పూజా కార్యక్రమాలను పూజ మండపంలో ఇకనుండి నిర్వహించనున్నారు.

జగన్మాతను దర్శించుకున్న ప్రముఖులు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారిని సోమవారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుజనా చౌదరి ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులు అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

క్షేత్రస్థాయిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కనకదుర్గ మ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలలతో పాటు పలు రాష్ట్రాలు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది అధికార యంత్రాంగం అంతా పూర్తి సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా విస్తృత ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యక్షంగా పరిశీలించారు. వినాయక గుడి వద్ద ప్రారంభమవుతున్న క్యూలైన్లతో పాటు ఘాట్ రోడ్డు పైకి వస్తున్న క్యూలైన్లు చిన్న రాజగోపురం అంతరాలయం వంటి ప్రాంతాలలో భక్తులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఇదే సమయంలో ఎంతో మంది భక్తులు సంతృప్తికర సమాధానం చెప్పగా, మరికొందరు వారికి ఎదురైన చిన్న చిన్న లోటుపాట్లను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ లక్ష్మీశా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లను పిలిపించి మరింత మెరుగ్గా సౌకర్యాలు కల్పించేలా పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

Leave a Reply