పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి..

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి..

  • సుమారు 15 టన్నుల బియ్యం స్వాధీనం
  • ఒక్క బియ్యపు గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని హెచ్చరిక
  • ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ

విజయవాడ, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం, జయంతి గ్రామంలో పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారుల సంయుక్త బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు.
కాజా సత్యనారాయణకు చెందిన గోదాంలో సుమారు15 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

సీజ్ చేసిన 295 బస్తాల రేషన్ బియ్యాన్ని తదుపరి చర్యలు నిమిత్తం కంచికచర్ల ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా స్వాధీనం చేసుకున్న 8 వాహనాలను వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందన్నారు.ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని.. నివేదికల ప్రకారం సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


పేదల కోసం ఉద్దేశించిన నిత్యావసర సరుకుల అక్రమ మళ్లింపును ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని, ఒక్క బియ్యపు గింజా పక్కదారి పట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతర తనిఖీలు చేస్తున్న ట్లు తెలిపారు.ఈ దాడిలో డీఎస్వో పి.వాణి, ఏఎస్‌వో వి.శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ లు బి.రామకృష్ణ, సీహెచ్ సుమతి, ఆర్‌ఐ కె.కిషోర్, స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply