అసలు ఏం జరిగింది..?
మోత్కూర్, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఓర్సు మహేష్ అసిస్టెంట్ లైన్ మెన్ గా పాలడుగు సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పాలడుగు సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగిపోవడంతో గురువారం ఉదయం ఎఎల్ఎం సురేష్ తో పాటు, విద్యుత్ సిబ్బంది కలిసి మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ క్రమంలో 11కె వి లైన్ ను ఆఫ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ని గద్దె పైకి ఎత్తి అమర్చే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.
తక్షణమే స్పందించిన తోటి సిబ్బంది, గ్రామస్తులు సురేష్ ను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా మండలంలోని ముషిపట్ల, పనకాబండ గ్రామాలలో సురేష్ అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేష్ మృతితో స్వగ్రామం దత్తప్ప గూడెంలో విషాదఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


