సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం

సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రామును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కలసి ఘనంగా సత్కరించారు. ఈ అపురూప ఘట్టానికి రాము తల్లి లక్ష్మి కూడా సాక్షిగా నిలిచారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలిసి రాముకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, విలువైన పుస్తకాలను బహుకరించి అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాము ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ఆదర్శం. తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును తీర్చిదిద్దడం, తండ్రిని కోల్పోయినా కుంగిపోకుండా ఎన్ఐటీ వరంగల్‌లో చదివి, నేడు సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. రాము సాధించిన ర్యాంకుకు ఐపీఎస్ వస్తుందని భావిస్తున్నానని, ఐఏఎస్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఏ విభాగంలో సేవలందించినా జిల్లాకు గర్వకారణమని ఆకాంక్షించారు.

సత్కార కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రాము తల్లిని గౌరవిస్తూ, ఆ తల్లికొడుకులను స్వయంగా కలెక్టర్ కార్యాలయం కింద వరకు తోడ్కొని వెళ్లి, మర్యాదపూర్వకంగా సాగనంపారు. ఉన్నతాధికారి చూపిన ఈ ఆత్మీయతకి వారిరువురు కృతజ్ఞతలు తెలిపారు.
…..

Leave a Reply