సంక్షోభంలో విద్యావ్యవస్థ..

సంక్షోభంలో విద్యావ్యవస్థ..

పాలకుల నిర్లక్ష్యంతో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
సీఎం రేవంత్ రెడ్డి మాటలు చేతలకు పొంతన లేదు
విద్యా రంగానికి బడ్జెట్లో నిధులు పెంచాలి
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలి
ఈనెల 24న కలెక్టరేట్ ముందు నిరసన
టీపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాదగిరి వెంకట్రామిరెడ్డి

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పాలకుల నిర్లక్ష్యంతో విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని టీపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంగోటి యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోరి వెంకట్రామిరెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ ను కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను వమ్ము చేశారన్నారు.

రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లలో, విద్యారంగానికి కేవలం 26,674 ఓట్లు కేటాయించారన్నారు. ప్రస్తుత బడ్జెట్లో గత సంవత్సర కేటాయింపులకు కేవలం 0.63 శాతం మాత్రమే పెంచి కేటాయింపులను 8.23 శాతానికి కుదించారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు.

పాలకుల నిర్లక్ష్యం వల్ల 2021 -22 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 27 లక్షల విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 16 లక్షలకు పడిపోయిందన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని అట్టహాసంగా ప్రకటిస్తూ, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయడాన్ని విస్మరించినట్లు విమర్శించారు. ఇంటిగ్రేటెడ్, పబ్లిక్ స్కూల్స్ అంటూ విద్యా కమీషన్ రిపోర్ట్ వచ్చిన తరుణంలో దిగువ స్థాయిలో విద్యారంగానికి కేటాయింపులు జరపడం గర్హనీయమన్నారు.

ఈ బడ్జెట్ వల్ల పేదలు నాణ్యమైన విద్యను పొందలేని పరిస్థితులు ఉత్పన్నమవడమే కాకుండా, అరకొర వసతులతో ఉన్న పాఠశాల వ్యవస్థ మరింత దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతుందన్నారు. విద్యారంగ బలోపేతానికి కొఠారి కమీషన్ తో పాటు అనేక మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం కేటాయింపులు జరుపాలని దశబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయని గుర్తుచేశారు.

నూతనంగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా విద్య శాఖ అధికారులను నియమించాలని, ఆంగ్ల భాష ప్రావీణ్యంకు జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలలో ఇఎల్టిసి సెంటర్లను బలోపేతం చేయాలని, డైట్, బీఈడీ, ఎస్సిఆర్టిలలో గల ఖాళీలను భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య అందదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల పైనే ఆధారపడుతుందన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడ్డ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలన్నారు.

సమస్యల పరిష్కారానికి ఈ నెల 24 మంగళవారం మధ్యాహ్నం 1 లకు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధులను 20 శాతానికి పెంచాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని, టీచర్ల పెండింగు బిల్లులు చెల్లించాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఎంఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, పూర్వప్రాథమిక పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలని, పెండింగ్లో ఉన్న డిఏ లను విడుదల చేయాలని, నూతనంగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులను మంజూరు చేయాలని, ఇఎల్టిసి కేంద్రాలను ప్రారంభించి ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply