తారకరామా’కు నిధులు విడుదల చేయండి

తారకరామా’కు నిధులు విడుదల చేయండి

  • రూ.4.05 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
  • శాసన సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మెట్ట ప్రాంతమైన మైలవరం నియోజకవర్గానికి సాగునీటి వరప్రదాయిని తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత బుధవారం మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు, మైలవరం, విజయవాడ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అప్పట్లో నందమూరి తారక రామారావు పేరుతో తారకరామా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు మూడవ జోన్ పరిధిలో మైలవరం ప్రాంతం చివరలో ఉన్న కారణంగా ఆయకట్టుకు సకాలంలో సాగునీటి సరఫరా విడుదల కాక అప్పటి జలవనరుల శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి, జిల్లా మంత్రి వసంత నాగేశ్వరరావు చొరవతో తారకరామ ఎత్తిపోతల పథకానికి 1988లో శ్రీకారం చూట్టారని చెప్పారు.

13,800 ఎకరాలకు సాగునీరు

కృష్ణాజలాలను తారకరామ ఎత్తిపోతల పథకంలోని పంపింగ్ స్కీం మోటర్లతో కుడి, ఎడమ కాలువలకు ఎత్తిపోయడం ద్వారా 56 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో పథకానికి రూపకల్పన చేశారన్నారు. దీన్ని 13,800 ఎకరాలకు పరిమితం చేసి, ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లతో 14 మోటార్లతో ప్రారంభించగా కాలక్రమేణా తాజాగా రైతులకు సాగునీరు అందించలేని దుస్థితికి వచ్చిందన్నారు. మెట్టప్రాంత రైతులందరూ ఈ పథకంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారన్నారు.

రూ.75 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు

2019లో తాను శాసనసభ్యుడిగా ఉండి రైతుల అవస్థలు చూసి అప్పటికప్పుడు రూ.75 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిల్లులు ఇవ్వాలని కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి విన్నవించినా బిల్లులు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో బిల్లులు చెల్లించారన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా పథకం

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తారకరామా ఎత్తిపోతల పథకం నిర్వహణకు నిధులు విడుదల చేయని కారణంగా క్రమేపి పథకం రైతులకు నిరుపయోగంగా మారిందన్నారు. కేవలం నాలుగైదు మోటార్లు మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయన్నారు. దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రూ.4.05 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారని అన్నారు. దీనికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు.

భూసేకరణ చేసి పథకాన్ని కొనసాగించాలి

ఇదే పథకం కింద గన్నవరం వరకు సాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో అప్పటి శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కాలువగా రైతులు నామకరణం చేసుకుని పిలుచుకునే కాలువ కూడా విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి వరకు ఏర్పాటు చేసి అక్కడ అర్ధంతరంగా నిలిపివేశారన్నారు. భారీగా వర్షాలు పడితే ఈ కాలువ పరిసరాల్లో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. భూ సేకరణ చేసి ఈ కాలువ కూడా చివర వరకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వసంత కోరారు.

Leave a Reply