ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : కొమరం భీం జిల్లా తిర్యాణి మండలంలోని పంగిడిమాదర ఆశ్రమ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏజెన్సీలో కలకలం రేపింది. పంగిడిమాదర ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఆత్రం అనురాగ్ కు (11) ఈ నెల 15న తీవ్ర జ్వరం రాగా, దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు అనురాగ్ కు నాలుగు రోజుల పాటు చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 19న మంచిర్యాల ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అక్కడి వైద్యులు బాలుడికి డెంగ్యూ సోకి రక్త కణాల సంఖ్య తగ్గిపోయిందని, కాలేయం సక్రమంగా పనిచేయడం లేదని తెలిపారు.
అయితే అనురాగ్ ను తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం తిరిగి వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తిర్యాణి ఆర్ బిఎస్ కె వైద్యాధికారి కౌటిల్య బాలుని పరిస్థితి విషమంగా ఉందని వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు.
మాత శిశు సంక్షేమ ఆస్పత్రిలో చికిత్స అందించి డాక్టర్ కౌటిల్య సూచన మేరకు ఈ నెల 21న బాలుని తల్లిదండ్రులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనురాగ్ పరిస్థితి విషమించి సోమవారం అర్ధ రాత్రి మృతి చెందాడు.
కాగా అనురాగ్ జ్వరంతో బాధపడుతున్న విషయం పై తమకుఎలాంటి సమాచారం అందలేదని డిడిఓ రమాదేవి తెలిపారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తమకు సమాచారం అంది ఉంటే బాలునికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేవారమని ఆమె పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయులు సాగర్ ను సస్పెండ్ చేస్తూ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సువార్తను విధుల నుండి పూర్తిగా తొలగించినట్లు ఐటిడి ఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు.