కృష్ణమ్మ దూకుడే దూకుడు

ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల రాక
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక…
నదీ పరివాహక ప్రాంతాలలో రెడ్ అలర్ట్…
భయాందోళనలో లోతట్టు గ్రామాల ప్రజలు..
ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ…

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణా పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు కారణంగా కృష్ణమ్మ (Krishnamma)కు వరద పోటు గంట గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage)కి ఎగువ నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న నీటి ప్రవాహంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టాన్ని దాటి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి వరద నీటిని సముద్రంలోకి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో (inflow ) అవుట్ ఫ్లో (outflow) సుమారు 7 లక్షల క్యూసెక్కులకు చేరుకున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తిస్థాయిలో అప్రమత్తమైన జిల్లా అధికారులు నదీ పరివాహక ప్రాంతాలలో ఎటువంటి సంచారము లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. అయితే లోత‌ట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన కలెక్టర్ నిరంతరాయంగా వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

గంట గంటకు ప్రవాహం పరవళ్లు
సోమవారం మధ్యాహ్నం నాటికి ప్రకాశం బ్యారేజీ కి వరద నీరు గంట గంటకు పెరుగుతూ వస్తోంది. మ్యారేజి ఎగువనున్న ప్రాజెక్టుల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు జిల్లాలో ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద 6,81,581 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇన్ ఫ్లో ఉండగా, కేఈ మెయిన్ కెనాల్ కు 8,212 వేల క్యూసెక్కుల నీరు, కెడబ్ల్యూ మెయిన్ కెనాల్ కు 5,527 వేల క్యూసెక్కులు మొత్తం కలిపి కెనాల్సి కు 13,739 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.3 అడుగుల మేర నీటిమట్టం ఉన్న నేపథ్యంలో దిగువకు మిగులు జలాలైన 6,67,842 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Leave a Reply