ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు వేగిరం
- అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
- సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ విజయవంతానికి అందరూ బృందంలా పని చేయాలని సూచన
కర్నూలు బ్యూరో ,అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ) సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ కేవలం రాజకీయ సభ కాదు.., దేశ ఆర్థికాభివృద్ధికి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజలకు చేరవేసే వేదిక.. ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా మమేకమవుతారు. అందువల్ల ఈ సభను చరిత్రాత్మకంగా మార్చాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంగళవారం సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, నీటి సదుపాయాలు, వైద్య సేవలు, పార్కింగ్, వేదిక నిర్మాణం వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ప్రజల్లో ఉత్సాహం నింపి ప్రధానమంత్రికి అద్భుత స్వాగతం పలుకుదామని కోరారు. సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.