ఆ ఊరు వెళుతున్నారా.. పిక్కలు జాగ్రత్త..

ఆ ఊరు వెళుతున్నారా.. పిక్కలు జాగ్రత్త..

భయాందోళనలో ప్రజలు..
స్కూల్ కి వెళ్లాలంటే.. విద్యార్థుల గుండె దడ..
ఈ సమస్యను తక్కువ అంచనా వేయద్దు..
వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాపాయం తప్పదు..
ఈ విషయంలో ఇంత వరకు చర్యలు శూన్యం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ – నారాయణపేట జిల్లాలోని ఆయా మండలాల్లో కుక్కలు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. అయితే.. పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో గ్రామాల్లో కుక్కలు చూస్తే ఎప్పుడు ఎవరిని కాటేస్తాయో అనే భయం ప్రజలను వెంటాడుతోంది. దీంతో ఆయా గ్రామాలలో కుక్కకాటు బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామంలో ఒకే రోజు ఎనిమిది మందిని కుక్కలు కాటేసి పశువుల పై దాడి చేసాయి. గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇంత వరకు కుక్కల తరలింపులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇటీవల మండల కేంద్రంలో శ్రీనివాస కాలనీలోని నలుగురు చిన్నారుల పై కుక్కలు దాడి చేశాయి. దీంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఊట్కూర్, కొల్లూరు, పెద్దపొర్ల తదితర గ్రామాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 మంది కుక్కకాటుకు గురి కాగా, కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. కొందరు ప్రైవేటు ఆసుపత్రిలో.. చికిత్సలు పొందుతున్నారు. ఆయా గ్రామాలలో కుక్కలు అధికంగా ఉండడం వలన చిన్నారులు, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల పై ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కాటును తక్కువ అంచనా వేయవద్దని ఒక కాటు వేసిన వెంటనే వైద్య చికిత్సలు చేసుకుంటేనే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఊట్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సంతోషి కుక్కకాటు బాధితులకు సలహాలు, సూచనలు ఆంధ్రప్రభ ద్వారా తెలిపారు.

కుక్క కాటు బాధితులు తీసుకోవలసిన జాగ్రత్తలు..
కుక్క కరిస్తే.. ఆ గాయాన్ని శుభ్రం చేయండి. కుక్క కాటుతో రక్తం వస్తే, వెంటనే గాయాన్ని సబ్బుతో అలాగే శుభ్రమైన నీటితో కనీసం 15 నిమిషాలు కడగాలి. ఇది వైరస్ లేదా బాక్టీరియా ప్రవేశాన్ని తగ్గిస్తుంది. ఆతర్వాత వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. వైద్యుడిని సంప్రదించి యాంటీ రేబీస్ టీకా అవసరమైతే టిటానస్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్కను గుర్తించండి. కరిచిన కుక్క పెంపుడు కుక్క అయితే, దానికి రేబీస్ టీకా వేసారా లేదా తెలుసుకోండి. తెలియని కుక్క అయినా.. పిచ్చికుక్క అనే అనుమానం ఉన్నా తప్పకుండా టీకాలు వేయించుకోవాలి.

టీకా షెడ్యూల్..
సాధారణంగా 0, 3, 7, 14, 28 రోజుల్లో 5 డోసులు ఇస్తారు. కుక్క కరిచిన మొదటి రోజు “డే 0” గా పరిగణిస్తారు.

జాగ్రత్తలు..
గాయం పై హల్దీ, నూనె, మసి, పిండి వంటి వాటిని రాయొద్దు. గాయానికి కట్టు కట్టకూడదు. గాలి తగిలేలా ఉంచాలి. కుక్కను చంపకండి. 10 రోజులు పరిశీలించండి.

నివారణ చర్యలు..
పిల్లలకు తెలియని కుక్కలకు దగ్గరగా పోవద్దని చెప్పండి. రోడ్డు మీద ఉన్న కుక్కలను రెచ్చ గొట్టవద్దు. మీ పెంపుడు కుక్కలకు రేబీస్ టీకా సమయానికి వేయించండి.

Leave a Reply