ఆక్వాలో జిల్లాను మేటిగా నిలపాలి

ఆక్వాలో జిల్లాను మేటిగా నిలపాలి

కలెక్టర్ చదలవాడ నాగరాణి


భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలోని ఆక్వా రైతులు ఆక్వా ఉత్పత్తులలో జిల్లాను మేటిగా నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి (Chadalawada Nagarani) తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుండి ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్‌పో హైదరాబాద్ ఆక్వా సదస్సుకు జిల్లా నుండి వెళుతున్న 40మంది ఆక్వా రైతులకు ఏర్పాటుచేసిన టూరిస్ట్ బస్సును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ… వరల్డ్ ఆక్వాకల్చర్ 2025 ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆక్వా ఎక్స్ పో నవంబర్ 11, 12, 13 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Hyderabad International Convention Center) లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇది ఆక్వాకల్చర్ పరిశ్రమ కోసం ఒక అంతర్జాతీయ కార్యక్రమ‌మ‌న్నారు. ప్రపంచ ఆక్వాకల్చర్ పరిశ్రమ నుండి ఆవిష్కర్తలు, రైతులు, భాగస్వాములను ఒకచోట చేర్చడం దీని లక్ష్యమ‌న్నారు. దీనిలో ఆసియా దేశాల్లో సైంటిస్టులతో పాటు వివిధ రాష్ట్రాల, జిల్లాల రైతులు, వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొనడం జరుగుతుందన్నారు. మూడు రోజుల ప్రదర్శనలో ఆక్వాకల్చర్ రంగంలో తాజా ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలను ప్రదర్శించడం, అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

నిపుణులతో స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి చర్చించడానికి అవకాశం లభిస్తుందన్నారు. సైంటిస్ట్ లు వారి పరిశోధనా అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, మేలైన ఉత్పత్తులను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులను తెలియజేయడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో రైతులు అవలంబిస్తున్న మేలైన పద్ధతులపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ ఎక్స్ పో (Expo) కు ఒక్కొక్కరి ప్రవేశ రుసుం రూ.14 వేలు చెల్లించాల్సి ఉందని, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్.ఎఫ్.డి.బి) స్పాన్సర్షిప్ తో 40మంది రైతులను ఉచితంగా ఎక్స్ పో విజిట్ కు పంపడం జరిగిందని తెలిపారు. ఆక్వా రంగంలో ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక అవగాహనను ఆక్వా రైతు అవగాహన చేసుకుని జిల్లాలో వినియోగించాలని తెలిపారు. మీరు తెలుసుకున్న విషయాలను మీ ప్రాంతాల్లోని రైతులకు కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎల్ ఎల్ ఎన్ రాజు, ఆర్.ప్రసాద్, మత్స్య శాఖ సిబ్బంది, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply