APTF | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో సెలవు రోజులు(Days off in planning) మినహాయించాలని ఏపీటీఎఫ్ రాష్ర్ట, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఎం.రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కేవీ. శివయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదవ తరగతి వందరోజుల కార్యచరణ ప్రణాళికలో రెండవ శనివారం, ఆదివారం సెలవు రోజులలో మినహాయింపు(Exception) ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ఏడాది విద్యా సంవత్సరంలో పదవ తరగతి వందరోజుల కార్యచరణ ప్రణాళికలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్(CCL) ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. డీఎస్సీ 2025 ఉపాధ్యాయులకు లీప్ యాపు ద్వారా సెలవు పెట్టుకోవడంలో ఇబ్బందులను తొలగించేందుకు డీడీఓలకు సూచనలు చేయాలన్నారు. బోధనేతర(Non-teaching) కార్యక్రమాలు ఉపాధ్యాయులకు మోయరాని భారంగా తయారయ్యాయని, బోధన సమయం హరించుకుపోతుందన్నారు.
విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన సరిగా జరగడం లేదని, అలాగే సిలబస్ పూర్తి కాకపోవడంతో వెనుకబడిన విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించడం కష్టతరంగా మారిందన్నారు. పరీక్షలు వెనువెంటనే నిర్వహించడం వలన అసెస్మెంట్ బుక్లెట్(Assessment booklet) రుద్దడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కావున పరీక్షల సంఖ్యను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు వీరేశ్వర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్, జిల్లా సబ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు.

