- సైబర్ నేరాలు ఎలా చేయాలో శిక్షణ
- ఎట్టకేలకు పట్టుకున్న తిరుపతి పోలీసులు
- నగదు, బంగారం, సాంకేతిక పరికరాలు స్వాధీనం
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయక ప్రజలను దోచుకుంటున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదు బంగారం ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
తిరుపతికి చెందిన వృద్ధురాలికి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని నమ్మించారు. మనీ లాండరింగ్ కేసులో సదరు మహిళ బ్యాంక్ అకౌంట్ వినియోగించారని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బెదిరించారు.
అరెస్టు చేయకుండా ఉండడానికి డబ్బు పంపించాలని. కేసుల్లో వృద్ధురాలి ప్రమేయం లేకపోతే ఆ డబ్బును తిరిగి పంపిస్తామంటూ నమ్మించారు. పలు సార్లు పలు అకౌంట్లకు సుమారు రూ.2.5 కోట్లు జమ చేయించారు. ఆ తరువాత వారి నుంచి ఫోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన వృద్ధురాలు ఈ నెల 13వ తేదీ తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక బృందాలు
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో అదనపు ఎస్పీ, సైబర్ క్రైమ్, క్రైమ్, పశ్చిమ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
విశాఖపట్నంలో మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 మొబైల్ ఫోన్లు, రెండు లాప్‌టాప్‌లు, ఒక సిమ్ మాడ్యులర్ ఎనిమిది రూటర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల అకౌంట్లో ఉన్న రూ.10 లక్షల నగదును ఫ్రీజ్ చేయించారు.
ఇప్పటి దాకా ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ.57 లక్షల నగదు, రూ.38 లక్షల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, మరో రూ.36 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కంబోడియా వెళ్లి సైబర్ నేరాలపై శిక్షణ
నిందితులు విశాఖపట్నం త్రినాధపురానికి చెందిన సింగంపల్లి గణేష్, చిన్న వాల్తేరుకు చెందిన పాలకొల్లు రవికుమార్, కంచరపాలెం సత్య నగర్‌కు చెందిన యుల్లి జగదీష్, మల్కాపురానికి చెందిన పెంకి ఆనంద్ సంతోష్ కుమార్, పెందుర్తి మండలం గొల్లవానిపాలెం ఎల్ఐసీ కాలనీకి చెందిన ఊటా అమర్ ఆనంద్, విశాఖపట్నంకు చెందిన కర్రి వాసుదేవ్‌గా పోలీసులు నిర్ధారించారు.
నిందితులంతా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కంబోడియా వెళ్లి సైబర్ నేరాలు ఎలా చేయాలో శిక్షణ పొందారు. అనంతరం విశాఖపట్నం వచ్చి ఒక గది అద్దెకు తీసుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
రూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, సిమ్ మాడ్యులర్, ఇతర సాంకేతిక పరికరాలతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అమాయకులే లక్ష్యంగా వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారుల అంటూ మోసం చేస్తూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రజలకు సూచనలు
డిజిటల్ అరెస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తు సంస్థలు డిజిటల్ అరెస్టులు చేయవన్నారు. సైబర్ నేరగాళ్ల బారినపడితే 1930 లేదా 112 లేదా 80999 99977కు సమాచారం ఇచ్చి సహాయం పొందవచ్చన్నారు.
ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సీఐ మురళీ మోహన్, సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాష్ కుమార్, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవిమనోహరాచారి, డీఎస్పీ శ్రీలత, ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు.