AP | మామిడి రైతును ఆదుకుంటాం…

AP | మామిడి రైతును ఆదుకుంటాం…
- మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతులను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి స్పష్టంచేశారు.
సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యంతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని తెలిపారు. మామిడికి కిలోకు రూ.4 మద్దతు ధర ప్రకటించడంతో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.183 కోట్లు జమ చేశారని చెప్పారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు చేరాయని వివరించారు.
గతంలో మామిడి పంట దిగుబడి అధికం కావడంతో ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోయారని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రొసెసింగ్ యూనిట్లకు కిలోకు రూ.8 చెల్లించాలని ఆదేశించిందని మంత్రి పేర్కొన్నారు.
ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు మాట్లాడుతూ… గుజ్జు పరిశ్రమలు, రైతులు పరస్పరం ఆధారపడి ఉన్నారని, రెండు వర్గాలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని అన్నారు. సబ్సిడీతో పాటు పరిశ్రమలు చెల్లించే ధరలు, వాటి చెల్లింపు తేదీలపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జూన్, జూలైలో 2.40 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని రైతుల నుంచి సమీకరించామని తెలిపారు. తమిళనాడు కృష్ణగిరితో పోల్చితే కొందరు యూనిట్లు తక్కువ ధరలు చెల్లించడం గమనార్హమని, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని, జీఎస్టీ తగ్గించడంతో పాటు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని పల్స్ పరిశ్రమ ప్రతినిధులు సమావేశంలో కోరారు. సమావేశంలో ఉద్యాన శాఖ డిడీ మధుసూదన్ రెడ్డి, పల్స్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
