AP భూగర్భంలో మెట్రో స్టేషన్ – విజ‌య‌వాడ స్పీడందుకున్న పనులు

కీలక ప్రాంతాల్లో భూసేకరణకు ప్లాన్​
రెండు కారిడార్లుగా విజయవాడ మెట్రో
34 ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం
91 ఎకరాల భూ సేకరణకు ప్రతిపాదనలు
మెట్రో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ₹11వేల కోట్లు
భూ సేకరణ వ్యయం ₹1152 కోట్లు
విజయవాడ సిటీలో 4.12 ఎకరాల సేకరణ
గన్నవరం సమీపంలో మెట్రో కోచ్​ డిపో

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో, విజయవాడ సిటీలో భూసేకరణకు అంచనాలు సిద్ధం చేశారు. ఏ ప్రాంతంలో ఎంత భూమి అవసరం అనేది అధికారులు ఖరారు చేశారు. ఈ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లున్నాయి. పీఎన్‌బీఎస్‌ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్.. కాగా, పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్‌గా తొలిదశలో మెట్రో నిర్మాణం జరగనుంది.

స‌ర్వే నెంబ‌ర్ల వారీగా వివ‌రాల సేక‌ర‌ణ‌..

మెట్రో రైల్ కోసం ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూమి అవసరమనేది రెవెన్యూ అధికారులు గుర్తించారు. వార్డు, సర్వే నెంబర్ల వారీగా వివ‌రాల‌ను తేల్చారు. నగరంలోని పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదలతో పాటు విజయవాడ రూర‌ల్‌ మండలంలోని ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడులో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం భూసేకరణ చేయనున్నారు.

34 ప్రాంతాల్లో మెట్రో స్టేష‌న్లు..

పీఎన్‌బీఎస్‌-గన్నవరం కారిడార్ 26 కిలో మీట‌ర్లు, పీఎన్‌బీఎస్‌-పెనమలూరు కారిడార్ 12.5 కిలో మీటర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారుగా 91 ఎకరాలు సేకరించనున్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ₹11వేల కోట్లు కాగా, భూసేకరణ వ్యయం ₹1,152 కోట్లు అని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అంచనా వేసింది. ఈ రెండు కారిడార్లలో 34 ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 20 స్టేషన్లు, కృష్ణా జిల్లా పరిధిలో 14స్టేషన్లు ఉన్నాయి. ఇందుకు గాను రెండు జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి మెట్రో కార్పొరేషన్‌ నివేదికలు సమర్పించింది.

విజయవాడ నగరంలో 4.12 ఎకరాలు

మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం విజయవాడ నగర పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో 4.12 ఎకరాల భూమి సేకరించనున్నారు. ఇందులో 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లోని 31కి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూమి సేకరించనున్నారు. బందరు, ఏలూరు రోడ్లను ఆనుకుని 12చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల మధ్యలోనే ఎక్కువ ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. విజయవాడ రూరల్​ మండలంలోని ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడులో కలిపి మొత్తం 1.28 ఎకరాల భూ సేకరణకు కసరత్తు మొదలైంది.

ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి ₹25 కోట్లు

మెట్రో ప్రాజెక్టు తొలి దశ నిర్మాణంలో మొత్తం 34 స్టేషన్లు నిర్మించనుండగా ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి ₹25 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో మూడు కిలోమీటర్లు మెట్రోలైన్‌ నిర్మించనుండగా ఇక్కడే ఒక మెట్రో స్టేషన్‌ కూడా ఉంటుంది. విజయవాడ, రూరల్​ మండలంలో మినహా ఎక్కువ శాతం కృష్ణా జిల్లా పరిధిలోనే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. గన్నవరం సమీపంలోనే మెట్రో కోచ్‌ డిపో నిర్మాణం కోసం 50 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply