తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుపతి రైల్వే స్టేషన్ లో రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్దరణ పనుల్లో భాగంగా దక్షిణం వైపు నిర్మిస్తున్న స్టేషన్ వచ్చే జూన్ లోగా సిద్ధం కానున్నది. ఈ సందర్భంగా ఈ రోజు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత అభివృద్ధి పనుల గురించి స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ వివరించారు.
ఆ వివరాలు ప్రకారం అమృత్ భారత్ పధకంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న 53 రైల్వే స్టేషన్ల పునరుద్దరణ పనుల్లో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులు 2022 జూన్ నెలలో మొదలయ్యాయి. రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ ఎల్ డి ఏ ) నేతృత్వంలో టెండరు దక్కించుకున్న వరింద్ర కన్స్ స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం పనులను చేపట్టింది.
ఆ పనుల్లో మొదటి దశలో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు భవన సముదాయం నిర్మాణం పనులు ముగింపుకొచ్చాయి. అందులో భాగంగా మొత్తం 10 అంతస్తుల భారీ భవనం సిద్ధం అవుతోంది. అందులో వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్లు, క్లోక్ రూములు, ఫుడ్ కోర్టుల వంటి వివిధ రకాల ఆధునిక సౌకర్యాలతో పాటు.. స్టేషన్ ఉత్తర దక్షిణ మార్గాలను అనుసంధానం చేసే 35 అడుగుల వెడల్పుతో రెండు బ్రిడ్జ్ లు ఏర్పాటు చేస్తున్నారు.
దాంతో పాటు 20 లిఫ్టులు, 24 ఎస్కలేటర్ లు వంటి వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో పూర్తి కానున్న మొదటి దశ అభివృద్ధి పనులలో భాగమైన తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భవన సముదాయానికి వచ్చే జూన్ నెలలో ప్రారంభోత్సవం చేయడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర అభివృద్ధి పనులన్నీ మరో ఏడాదిలోగా పూర్తి చేసి 2026 జూన్ నెల తిరుపతి మోడల్ స్టేషన్ ను ప్రారంభించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈరోజు సత్యనారాయణ తో పాటు రైల్వే స్టేషన్ మాస్టర్ చిన్న రెడ్డెప్ప, ఇంజనీర్ సాంబశివారెడ్డి తదితరులు జరుగుతున్న అభివృద్ధి పనులను మీడియా కు చూపించారు .