- 67,27,164 మంది విద్యార్ధులకు లబ్ది
- 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ
- ఉత్తర్వుల కాపీని మంత్రి నారా లోకేష్ కు అందించిన చంద్రబాబు
వెలగపూడి, ఆంధ్రప్రభ : అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయేకు రెండు కళ్ళన్నారు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu). సంపద సృష్టిస్తాం.. సంక్షేమం ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని నేడు లాంచనంగా చంద్రబాబు ప్రారంభించారు. దీనిలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తల్లికి వందనం జీవోలను చంద్రబాబు అందజేశారు.
అనంతరం లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో అతి కీలకం తల్లికి వందనం అని అన్నారు. ఒకరికి ఇచ్చి.. మిగిలిన వాళ్లకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని భావించామని.. అందుకే ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 42 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 67 లక్ష మందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. తల్లి తండ్రులు లేని పిల్లలకు గార్డియన్ ఖాతా (Guardian Account) లో వేస్తున్నామన్నారు. పారదర్శకత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెడతామని తెలిపారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉందని.. ఈనెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఏ మాట అయితే చెప్పానో.. దాన్ని అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ పథకానికి ఇప్పటివరకు 7,27,164 మందిని అర్హులుగా గుర్తించామన్నారు.. ఈ పథకం ద్వారా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేయనున్నట్లు వెల్లడించారు..అయితే పాఠశాల అభివృద్ది నిధి కింద రూ.2వేలు మినహాయింపు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం కోసం రూ.8745 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.
ఇక ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించగా.. పక్కనే నవ్వుతూ కనిపించారు లోకేష్ (Lokesh). అన్నదాత సుఖీభవ పథకం కింద వైసీపీ ప్రభుత్వం కంటే రూ.6 వేల రూపాయలు ఎక్కువ ఇస్తున్నామన్నారు. పెన్షన్ కూడా ఒకేసారి వెయ్యి పెంచి రూ.4 వేలు ఇస్తున్నామన్నారు. బటన్ నొక్కుతున్నామని మాయమాటలు చెప్పే పెద్దలకు ఇది అర్థం కావాలంటూ పరోక్షంగా జగన్ (Jagan) పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
బటన్ నొక్కుతున్న అంటూ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్తితిని చిన్నా భిన్నం చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఉద్యోగులకు సరైన జీతాలు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకబోయిందని విమర్శించారు. ఇక అన్నా క్యాంటీన్ల (Anna Canteens) ద్వారా 4కోట్ల మంది ఆకలి తీరుస్తోంది.. నిరుద్యోగ భృతి కూడా వీలైనంత త్వరగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాము.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన పాలన అందించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యం అంటూ పేర్కొన్నారు. తాను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడని చిత్రాలు వైస్సార్సీపీ వలన చూడాల్సి వస్తోందని అన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి, అలాగే దీపం పథకం ద్వారా 2కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా అందిస్తున్నామని స్పష్టం చేసారు.
అన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ ..
మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువచ్చారన్నారు. ఎమ్మార్వో ఆఫీసులు తాకట్టు పెట్టారన్నారు. ఆర్థిక వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని.. అభివృద్ధి ని గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఈ ఏడాదిలో సుపరిపాలన (good governance) ను చేపట్టి వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డ నిధిని పీ4కు అనుసంధానం చేస్తామన్నారు. ఇబ్బందులు చాలా ఉన్నాయని.. రాక్షసుల మాదిరిగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. తానెప్పుడూ చూడని ఆకృత్యాలకు పాడుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. అలాంటి వారికి, నేరస్థులకు వైసీపీ అండగా ఉంటోందని సీఎం ఆరోపించారు.
నేనెవరికీ భయపడను.. తోక జాడిస్తే వదల..
‘బాబాయ్‌ను చంపి నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం, పత్రికల్లో వేసే ధైర్యం ఎలా వచ్చింది. తెనాలిలో గంజాయి, రౌడీలకు వెళ్లి మద్దతు ఇస్తారా? అమరావతి దేవతల రాజధాని అయితే వేశ్యల రాజధాని అంటారా? ఒళ్ళు కొవ్వెక్కి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. నాకు పబ్లిక్ సేఫ్టీ చాలా ముఖ్యం. రౌడీలను, తీవ్రవాదులను, ఫ్యాక్షనిస్ట్‌ల (Factionist) ను, మత కల్లోలాను అణచి వేశాను. నేను ఎవరికి భయపడను. ఇంత వరకు నా మంచితనం చూశారు. ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టను. ఈ నెల 20 అన్నదాత సుఖీభవ పథకం ఇస్తున్నాం. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా బుద్ధి లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా త్వరలో చూపిస్తాము’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
