అనకాపల్లి, ఆంధ్రప్రభ :అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోటవురట్ల మండల కైలాసపట్నం ప్రాంతం పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దం సమీప గ్రామాలకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
ఘటనాస్థలిని చూసిన వారెవరికైనా నిద్ర పట్టని దృశ్యాలే కనిపించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫ్యాక్టరీలో 30 మంది..కాగా, ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం. భారీ పేలుడుతో ఫ్యాక్టరీ మొత్తం క్షణాల్లో ధ్వంసమైపోయింది. అక్కడి పరిస్థితులు చూస్తే… మానవ శరీరాలు ముక్కలుగా విడిపోయిన దృశ్యాలు వేదన కలిగించేలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు పూర్తిగా గుర్తు పట్టలేని స్థితిలో బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
8మంది దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం.
మృతుల వివరాలు..
కోటరవుట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన రామలక్ష్మీ (40) , కైలాసపట్నం గ్రామానికి చెందిన పురం పాప (55), గుంపిన వేణు , సేనాపతి బాబురావు, విశాఖపట్నానికి చెందిన మనోహర్, దేవర నిర్మల (38), అప్పికొండ చంటిబాబు , సంగారి గోవింద్. .
ఇక తీవ్రంగా గాయపడిన కోటరవుట్ల మండలం రాట్నాలపాలెం గ్రామానికి చెందిన జల్లూరి నూకరాజు (50), సామర్లకోటకు చెందిన వేలంగణిని సంతోషి , కైలాస పట్నానికి చెందిన మడగల జానకీరామ్, వేలంగిణీ సరోజినీని విశాఖపట్నం జీజీహెచ్ కు తరలించారు.








