AP | కృష్ణా జలాల‌ను ఎపి త‌ర‌లించుకుపోతున్న‌ది.. చ‌ర్య‌లు తీసుకోండిః కేంద్రమంత్రి పాటిల్ కు రేవంత్ విన‌తి

న్యూ ఢిల్లీ – కృష్ణాన‌దీ జలాల కేటాయింపులపై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర జ‌ల శ‌క్త మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ తో క‌ల‌సి నేడు కేంద్ర‌మంత్రిని రేవంత్ క‌లిశారు.. కృష్ణా జలాల కేటాయింపుల‌లో ఇప్ప‌టికే తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని వివ‌రించారు. అలాగే ఎపి ప్ర‌భుత్వం చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ పై అభ్యంత‌రాలు ఉన్నాయ‌ని, వెంట‌నే ఆ ప్రాజెక్ట్ ను నిలిపివేయాల‌ని కోరారు.. గోదావ‌రి జ‌లాల‌లు కేటాయింపులు లేకుండానే ఎపి భారీ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేప‌డుతున్న‌ద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. వెంట‌నే కేంద్ర జోక్యం చేసుకుని త‌మ‌కు న్యాయ చేయాల‌ని కోరారు.

ఇప్ప‌టికే ఎపి కృష్ణా న‌ది జలాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకుపోతున్న‌ద‌ని, తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నీటి త‌ర‌లింపు మాత్రం ఆగ‌డం లేద‌ని రేవంత్ చెప్పారు.సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ, సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రితో కూడా చ‌ర్చించిన‌ట్లు రేవంత్ ఈ మీటింగ్ అనంత‌రం మీడియాకు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన దానికంటే ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామని.. తప్పని సరిగా జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని.. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెపుతోందని ప్రశ్నించారు.
కృష్ణా, గోదావరి జలాల్లో మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే వాళ్ల ప్రాజెక్టులను అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డీపీఆర్ ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారనన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపుపైనా మంత్రితో చర్చించామని తెలిపారు. అలాగే.. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని అడిగామన్నారు.
మొత్తం ఐదు ప్రాజెక్ట్‎లకు నిధులు ఇవ్వాలని కోరామని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగాం.. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని చెప్పామని పేర్కొన్నారు. దీంతో పాటుగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరామని చెప్పారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇస్తే.. బ్యారేజ్ కుంగడానికి బాధ్యులైన వారిపై మేం చర్యలు చేపడతామని అన్నారు.

కాంగ్రెస్ పెద్ద‌ల‌తో భేటి

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నెల పది వరకు నామినేషన్లకు గడువు ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎవరెవరికి, ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందని అంశంపై చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *