AP | జగన్ పై పోలీసు అధికారుల సంఘం గరం గరం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ – రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకతీతంగా అమలు చేస్తుంటే పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది.
విజయవాడలోని గాంధీ నగర్ లో ఉన్న ప్రెస్ క్లబ్లో మంగళవారం సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాల సురేష్, స్టేట్ కోఆప్షన్ మెంబర్ అక్కిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి రాష్ట్రంలో లా అండ్ దిగజారిపోయిందని రిటైర్డ్ పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబడతామని మాట్లాడడం దారుణం అన్నారు.
రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడానికి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల కిందట జగన్ ప్రభుత్వంలోనే పనిచేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వాటిని మరిచిన మాజీ ముఖ్యమంత్రి పోలీసులు రాజకీయాలకు వర్గాలకు రాగద్వేషాలకతీతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమన్నారు.
పోలీసులు ఎప్పుడూ చట్టానికి ధర్మానికి న్యాయానికి సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారే తప్ప చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి చేయరన్న విషయాన్ని మాజీ సీఎం తెలుసుకోవాలన్నారు. సప్త సముద్రాలు దాటి అయినా బట్టలూడదీస్తామని చేసిన బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై చట్టాలపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కనీస గౌరవం లేదన్న విషయం బహిర్గతమైందన్నారు. పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపులు వ్యాఖ్యలు ఇకనుంచి అయినా మానుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.