AP POLICE | అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం
AP POLICE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాల పై జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. ఓపెన్ డ్రింకింగ్, బహిరంగ ప్రదేశాల్లో అకారణంగా గుమికూడడం, యువత అల్లరి చేష్టలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే సంఘటనలను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పురవీధుల్లో ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లరి మూకలను చెదరగొట్టారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 10 మంది వ్యక్తులను డ్రోన్ కెమెరా సహాయంతో గుర్తించి వారిని చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించి వారి పై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పై ఎలాంటి సానుభూతి చూపేది లేదని ఓపెన్ డ్రింకింగ్, రోడ్ల పై అల్లర్లు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి వాతావరణం కాపాడాలని స్పష్టం చేశారు.

