రూ.1290 కోట్లతో నిర్మించే ప్రాజెక్ట్ కు పవన్ శంకుస్థాపన
చిన్నప్పుడు రెండేళ్లు ఇక్కడే ఉన్నానన్న ఉప ముఖ్యమంత్రి
కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండేదని వెల్లడి
ఫ్లోరైడ్ భయంతో ఆరు నెలలకే ఊరు వదిలి వెళ్లామన్న పవన్
అప్పటి నుంచి ఇప్పటికీ తాగునీటి సమస్య ఉండటంపై ఆవేదన
మార్కాపురం – ప్రకాశం జిల్లా (Prakasam ) ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి (driking water ) కష్టాలతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆ సమస్య తీవ్రత తనకు బాగా తెలుసని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (deputy chief minister ) అన్నారు. మార్కాపురంలో (markapuram ) నిర్మించే జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటిని అందించే ప్రాజెక్టుకు నేడు పవన్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.1,290 కోట్లతో చేపడుతున్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
చిన్నప్పుడు సుమారు రెండేళ్ల పాటు ఈ ప్రకాశం జిల్లాలోనే ఉన్నానని అన్నారు. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో నివసించేవాళ్లమని పేర్కొన్నారు. అక్కడి నీటిలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దానివల్ల మోకాళ్లు, వెన్నెముకలు వంగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.. ఈ విషయం తెలియడంతో, కేవలం 6 నెలల్లోనే తమ కుటుంబం ఆ ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్లామని వివరించారు.
అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య కొనసాగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ సమస్య కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఈ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎదుర్కొన్న సమస్యను ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పరిష్కరించే అవకాశం రావడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
కుత్తుకలు కోస్తాం అంటే సహించేది లేదు …
గత జగన్ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులని పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలి వేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు. కుత్తుకలు కోస్తాం అనే వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని అన్నారు. మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు. వైసీపీకి 151 సీట్లు వచ్చి… తాను రెండు చోట్ల ఓడినప్పుడు కూడా వారిని ఎదిరించానని గుర్తుచేశారు. సినిమా డైలాగులు నిజజీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు. తలదించుకుని పనిచేస్తున్న వారిని రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు పవన్ కల్యాణ్.