వెలగపూడి – 11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై వైసిపి అధినేత జగన్ నేడు కౌంటర్ ఇస్తూ, పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.. దీనిపై జనసేన ఘాటుగా స్పందించింది.. ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి, మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “నువ్వు కోడికత్తికి ఎక్కువ… గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా! నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు” అంటూ ధ్వజమెత్తారు.
క్రిమినల్ మైండ్ తో వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని విమర్శించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ ను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇక జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. “సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు… తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా” అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.