విజయవాడ : ఎపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో సీఐడీ సిట్ అధికారులు ఇవాళ తొలి ఛార్జిషీట్ దాఖలు చేశారు. మద్యం స్కాం ఎలా జరిగింది ?నిందితులు ఎవరు ? సాక్షులెవరు ? ఇతర వివరాలతో మొత్తం 300 పేజీల అభియోగపత్రాన్ని కోర్టులో ఇవాళ దాఖలు చేశారు.
వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం స్కాం విలువ రూ.3500 కోట్లుగా అధికార కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో 62 కోట్ల మొత్తాన్ని ఇప్పటివరకూ సీజ్ చేసినట్లు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. 100కు పైగా ఫోరెన్సిక్ నివేదికలు ఇందులో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో 268 మంది సాక్ష్యుల్ని విచారించినట్లు సీఐడీ సిట్ తెలిపింది. అలాగే ఈ కేసులో డబ్బు ఎవరెవరి నుంచి చేతులు మారిందనే అంశాల్ని ప్రాధమికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.
Also Read Warning | ఎపి లో పిడుగులతో వానలు – రెండు రోజులు హై అలెర్ట్
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
మరోవైపు మద్యం స్కాంలో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో ఊరట లభించకపోవడంతో ఇవాళ నేరుగా విజయవాడ వచ్చి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన్ను ఐదు గంటల పాటు అధికారులు విచారించారు. ఇందులో మిథున్ రెడ్డి పాత్రపై ముందుగా సిద్దం చేసిన ప్రశ్నలనే అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి అంతిమ లబ్దిదారుకు స్కాం సొమ్ము ఎలా చేర్చారన్న దానిపై మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. దీనికి మిథున్ రెడ్డి సమాధానాలు రాబట్టుకున్న సీఐడీ.. విచారణ ముగించిన అనంతరం మిథున్ ను అరెస్ట్ చేశారు..
కాగా , మరో 20 రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రెండో ఛార్జిషీట్ లో మిథున్ రెడ్డి పేరు ఉండే అవకాశం ఉంది. ఆ లోపు మిథున్ రెడ్డిని విచారించి అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

