- ప్రజాప్రతి నిధుల సూచనలు, సలహాలు పరిశీలిస్తాం..
- మార్పులు చేర్పులతో త్వరలోనే మాస్టర్ ప్లాన్…
- మంత్రులు ఆనం, నారాయణ, సత్య కుమార్..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, రూ.ఐదు కోట్ల రాబడి వచ్చే ప్రతి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ సంబంధిత అధికారులతో గురువారం పశ్చిమ అభివృద్ధిపై తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుజన చౌదరి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
సుజనా ఫౌండేషన్ అడ్వైజర్ వేజెండ్ల శ్రీనివాసరావు పశ్చిమంలోని అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని చేయవలసిన అభివృద్ధి పనులను, ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
కాళేశ్వరరావు మార్కెట్ వద్ద నిత్యం ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నైజాం గేటు వద్ద అండర్ పాస్, కేదారేశ్వరపేట నుంచి పాల ప్రాజెక్టు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం, మీసాల రాజారావు బ్రిడ్జి నుండి రైల్వే స్టేషన్ వరకు బీ ఆర్ టీ ఎస్ రోడ్డు విస్తరణ, షాదీ ఖానాల అభివృద్ధి, కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఏలూరు కాలువ, బందర్ కాలువ గట్టుల సుందరీ కరణ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల నిర్మాణం ఇల్లు లేని నిరుపేదలకు టిడ్కో ఇల్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ను కోరగా సానుకూలంగా స్పందించారు.
ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులకు టెక్నికల్ టీం కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి చేపట్టబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఆలయం, పశ్చిమ లోని ఇతర ఆలయాల అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశామన్నారు. భవిష్యత్తులో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ లో పలు సూచన చేసామన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల పైన రాబడి వచ్చే దేవాలయాలను అభివృద్ధి పరుస్తామన్నారు.
రెండో ఘాట్ రోడ్, మల్టీ లెవెల్ పార్కింగ్, క్యూలైన్ల ఆధునీకరణ , ఎలివేటెడ్ క్యూ లైన్ల నిర్మాణం తదితర అంశాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు
వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ… రోగులకు వైద్యం అందించే విషయంలో సుజనా చౌదరి చేసే ప్రయత్నాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు డిజిటల్ వ్యసనాలకు లోను కాకుండా నషా ముక్త్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.
పశ్చిమ లోని ప్రభుత్వ స్థలాలని గుర్తించి క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను 50% ప్రజలకు పూర్తి చేశామని 1% అనుమానిత కేసులను గుర్తించామన్నారు. ఆయుష్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ,ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి కార్య నిర్వాహ కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , కోగంటి రామారావు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్ , హరీష్, టెక్నికల్ టీం సభ్యులు బోరా శ్రీనివాస్ నాయుడు,విఎంసి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.