- బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పాటుపడ్డారు
- ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజమే సీఎం చంద్రబాబు లక్ష్యం
- ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోంది
- కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం, (ఆంధ్రప్రభ): ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని ఆయన స్పూర్తితో పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నారా భువనేశ్వరి అన్నారు. సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో సీఎం చంద్రబాబు పయనిస్తున్నారని అన్నారు.
4వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుప్పంలో కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నత కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆమె పేర్కొన్నారు.
అదే విధంగా కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆమె తెలిపారు.
ఎన్టిఆర్ ఆశయాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని, పేదలందరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నారని నారా భువనేశ్వరి తెలిపారు.