ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన చారిత్రాత్మక ఇ-కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పునరుజ్జీవనానికి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ప్రకటించింది. ఈ నిర్ణయాలు 1.5 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉండటంతో, పరిశ్రమల వృద్ధికి రాష్ట్రం తీసుకుంటున్న దూకుడు మరోసారి స్పష్టమవుతుంది.
₹80,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం
కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ₹80,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు వివిధ రంగాల్లో విస్తరించి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయి.
ప్రధానంగా, ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం 4.0 (2025–30) కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా శ్రీ సిటీ, ఒర్వకల్, కొప్పర్తి, హిందూపూర్ వంటి ప్రత్యేక జోన్లలో ప్లగ్-అండ్-ప్లే తయారీ సౌకర్యాలు, ముందస్తు సబ్సిడీలు, 20–30% మూలధన సబ్సిడీ (విలువ జోడింపు కోసం అదనంగా 5%), SGST పూర్తి రీయింబర్స్‌మెంట్, ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ యూనిట్‌కి రూ.1 సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తాయి.
9వ SIPB సమావేశంలో ఆమోదం పొందిన రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు కూడా ఈ సందర్భంగా ఖరారు అయ్యాయి. సిఫీ, సత్వ, బి.వి.ఐ.ఎం, ఏఎన్ఎస్ఆర్ వంటి ప్రముఖ సంస్థలు 50,600కు పైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. ముఖ్య ప్రాజెక్టుల్లో..
- రుషికొండలో Phenom People Pvt. Ltd. IT క్యాంపస్ (₹207 కోట్లు, 2,500 ఉద్యోగాలు)
- మధురవాడ, పరదెసిపాలెంలో Sify డేటా సెంటర్లు (₹16,466 కోట్లు, 600 ఉద్యోగాలు)
- కర్నూలులో Agastya Energy సౌర సెల్/మాడ్యూల్ ప్లాంట్ (₹6,933 కోట్లు)
- అనకాపల్లిలో Laurus Labs విస్తరణ (₹5,630 కోట్లు)
- JSW AP స్టీల్ ప్లాంట్ (₹4,500 కోట్లు)
- విశాఖ, విజయవాడల్లో Lulu షాపింగ్ మాల్స్ నిర్మాణం (₹1,222 కోట్లు)
అంతరిక్షం, క్వాంటం రంగాల్లో కొత్త అడుగులు
రాష్ట్రంలో ఉన్నత సాంకేతిక రంగాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 2025–30కి ఆమోదం లభించింది. అంతరిక్ష పరిశోధనలో రాష్ట్రం ముందుండేలా ప్రోత్సహణ కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.
అదనంగా, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ స్థాపనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలోనే మొదటిసారిగా నవంబర్‌లో 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ విస్తరణ కోసం మరో 790 ఎకరాల భూమి సేకరణకు కూడా ఆమోదం లభించింది.
పట్టణ అభివృద్ధి, మెట్రో ప్రాజెక్టులకు ఊతం
కేబినెట్ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ప్రతిపాదనలను ఆమోదించి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ప్రఖ్యాత విద్యాసంస్థలు, ఆరోగ్య సేవలు విస్తరించడానికి పచ్చజెండా ఊపింది.
అనధికార నిర్మాణాలకు చట్టబద్ధత కల్పిస్తూ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS-2020)లో సవరణలు, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (BPS) పునరుద్ధరణకు ఆమోదం లభించింది. విశాఖపట్నం-విజయనగరం-అనకాపల్లి ప్రాంతాల్లో భూసేకరణకు అవకాశం కల్పించింది.
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రథమ దశలకు ఆమోదం లభించగా, ఇవి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పేదలకు తాగునీరు అందించేందుకు రూ.10,000 కోట్లు కేటాయించారు. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కోసం HUDCO నుంచి రూ.1,000 కోట్ల రుణానికి షార్ట్‌ఫాల్ గ్యారంటీ మంజూరు చేశారు.
అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో విశ్వ ఆర్థిక వేదిక (World Economic Forum) కార్యాలయ నిర్మాణంకు కూడా ఆమోదం లభించింది.
హరిత ఇంధనం, సంక్షేమానికి ప్రాధాన్యం
అమరావతిలో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ డిక్లరేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్వ ప్రభుత్వం పెంచిన పర్యావరణ పన్నులను తగ్గిస్తూ పరిశ్రమలు, ప్రజలకు ఊరట కల్పించారు.
ఉద్యోగ కల్పనలో పారదర్శకత కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుకి ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుడు తొట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై, మంత్రుల పనితీరుపై కూడా చర్చ జరిగింది.

