అవినీతికి పాల్పడ్డట్టు ఫిర్యాదులు
ఇస్రో పండ్స్ దుర్వినియోగం చేశారు
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలపై స్పష్టత
విచారణ రిపోర్టు రాగానే చర్యలుంటాయన్న మంత్రి లోకేష్
వెలగపూడి, ఆంధ్రప్రభ:
ఆంధ్రా యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై లోకేష్ సమాధానమిస్తూ.. మాజీ సీఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు.
ఇస్రో ఫండ్స్ దుర్వినియోగం..
ఇస్రో నుంచి వచ్చిన ₹25 లక్షలను ఖర్చు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందిందన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. విజిలెన్స్ రిపోర్టు వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు, మరోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలను పెంచి, గతవైభవం తెస్తామని ప్రకటించారు.
రాజకీయాల్లేవు, సమర్ధుడికే వీసీ పదవి..
ఆంధ్రా యూనివర్సిటీ అంటే అందరికీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛైర్మన్, జీఎమ్మార్ అధినేత ఏయూలో చదువుకుని వచ్చిన వారేనని, ఏయూ ప్రపంచంలోనే టాప్ 100లో ఉండాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి లోకేష్ అన్నారు. ఏయూ టాప్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఐఐటీ ఖరగ్ పూర్ ప్రోఫెసర్ రాజశేఖర్‌ను వీసీగా నియమించామన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు దారిలోకి వస్తున్నాయని అన్నారు.. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు లోనుకాకుండా విద్యాభివృద్ధి కోసమే పని చేయాలనేదే తమ విధానమని చెప్పారు.