మాజీ సీఎం జగన్ తీరు పై స్పీకర్ అసహనం..
గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచిది కాదు..
సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి..
సాక్షిలో ఎమ్మెల్యేలకు శిక్షణ అంటూ తప్పుడు కథనం
దీనిపై విచారణకు ఆదేశించిన అయ్యన్న పాత్రుడు
జగన్ ను జోకర్ గా పోల్చిన లోకం నాగమాధవి
జగన్ ను చూస్తే కడుపుమండిపోతున్నదన్న విష్ణుకుమార్ రాజు
వెలగపూడి, ఆంధ్ర్రప్రభ – నేడు సభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ, జగన్ ఓ జోకర్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును గౌరవించని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు.. తమ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అలాగే గిరిజన గ్రామాల్లో డోలీ కష్టాలను ఈ ప్రభుత్వం తీరుస్తోందని అన్నారు.
జగన్ ప్రవర్తన చూస్తే కడుపు మండిపోతున్నది ..విష్ణుకుమార్

నిన్ని శాసనసభలో జగన్ ప్రవర్తన చూస్తే తన కడుపు మండిపోతున్నదని శాసనసభలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. ఇవాళ సభకు వస్తారేమో కడుపుమంట తీర్చుకుందామనుకున్నానని అన్నారు.. నేడు జగన్ రాలేదు, ఆయన వందిమాగదలు హాజరుకాలేదని పేర్కొన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూశారని, అయితే వారికి నిరాశే మిగిలింది అని అన్నారు. జగన్ వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూశారని అంటూ చూసిన తర్వాత వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందని అనుకుంటున్నారని పేర్కొన్నారు.. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదని మండిపడ్డారు.
చర్చను ప్రారంభించిన కూన

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చను ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం ఎంతో బాధాకరమని, అంటూ జగన్ వైఖరిని తప్పుపట్టారు. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయిల ధాన్యం బకాయిలున్నాయని తెలిపారు. రైతులను జగన్ ప్రభుత్వం గతంలో ఎంతో బాధపెట్టిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 24 గంటల్లో చెల్లిస్తుందని గుర్తుచేశారు.ఏపీలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
జగన్ తీరుపై స్పీకర్ అసహనం..

అసెంబ్లీలో నిన్న మాజీ సీఎం జగన్ తీరు పై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచి సంప్రదాయం కాదన్నారు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే ముందు నేడు ఆయన సభలో మాట్లాడుతూ, సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు .. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అని స్పష్టం.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం పై వైసీపీకి అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు.. సభకు వచ్చి మాట్లాడచ్చు.. కానీ, ప్రసంగానికి ఆటంకం కలిగించడం మాత్రం మంచి పద్దతి కాదన్నారు.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కావొద్దన్నారు.. నిన్న పరిణామాలు చాలా బాధ అనిపించిందన్నారు స్పీకర్.
అసెంబ్లీకి గవర్నర్ అతిధిగా వచ్చారు.. గవర్నర్‌ను అందరూ గౌరవించాలని అని సూచించారు అయ్యన్నపాత్రుడు.. నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది.. ఒక ముఖ్యమంత్రి గా పని చేసి.. పార్టీ అధ్యక్షుడుగా ఉండి.. సభ్యత మర్చిపోయి ప్రవర్తించారని వైఎస్ జగన్‌పై మండిపడ్డారు.. కూర్చుని జగన్ నవ్వుకుంటున్నారు.. పైగా వారి సభ్యులను ఎంకరేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.. కాగితాలు చింపి పోడియం పై విసిరారు.. ఇది పద్ధతి కాదు.. సంప్రదాయం కాదని హితవుచెప్పారు.. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు.. పక్కన ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా తోడ్పాటు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
సాక్షి పత్రికపై విచారణకు ఆదేశం
ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై జగన్ పత్రిక సాక్షిలో వచ్చిన కథనాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఆ మీడియాపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు అయ్యన్న తెలిపారు. సభా హక్కుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టసభలపై కూడా గౌరవం లేకుండా ఆ మీడియాలో కథనాలు వస్తుండటం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయల ఖర్చు పెట్టారంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాల పేపర్ కటింగులను అసెంబ్లీలో స్పీకర్ ప్రదర్శించారు. అందులో వచ్చిన కథనాల విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పీకర్ స్పందిస్తూ… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించలేదని… జరగని శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆ పత్రిక లో రాశారని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్, ఏపీ స్పీకర్ పై కథనాలు రాశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు రాతలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని… ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆ పత్రిక పై తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.